
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మణుగూరురూరల్: అసాంఘిక కార్యకలాపాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని మణుగూరు డీఎస్పీ వంగా రవీందర్‌రెడ్డి సూచించారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని భగత్‌సింగ్‌నగర్ లో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ రవీందర్‌రెడ్డి నేతృత్వంలో సీఐ పాటి నాగబాబు ఆధ్వర్యంలో ఎస్‌ఐలు, సిబ్బంది భగత్‌సింగ్‌నగర్‌లోని ప్రతీ ఇంటిని తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 44 ద్విచక్రవాహనాలు, నాలుగు ఆటో లు, బెల్ట్ దుకాణాల్లోని రూ.25 వేల విలువ చేసే మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలకు ప్రజలు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. యువత గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దని, ద్విచక్ర వాహనదారులు సంబంధించిన పత్రాలు కలిగి ఉండాలని, వాహనాన్ని నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు పంపే లింకులను ఓపెన్ చేయొద్దని పేర్కొన్నారు. చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. బెల్ట్ దుకాణాలతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు డీఎస్పీకి తెలపడంతో సంబంధిత షాపు యజమానులను హెచ్చరించారు. అనంతరం సరైన పత్రాలు లేని వాహనదారులకు జరిమానా విధించారు. కార్యక్రమంలో అశ్వాపురం సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐలు రంజిత్, మనీషా, సురేశ్, మధుప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.