
కోయ భాషలో పెళ్లి పత్రిక
ఆవిష్కరించిన పీఓ రాహుల్
భద్రాచలంటౌన్: కోయ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ ఆదివాసీ తెగల సమన్వయకర్త సోయం కన్నారాజు – శరణ్య తమ పెళ్లి పత్రికను కోయ భాషలో ముద్రించారు. ఈ పత్రికను ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సోమవారం తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోయ భాషలో ఉన్న పెళ్లి పత్రికను చూడటం ఆనందంగా ఉందన్నారు. గిరిజనుల మాతృభాషలో లిపి అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. అంతరించిపోతున్న ఆదివాసీ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు అందించే ప్రయత్నంలో భాగంగానే ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేశామని చెప్పారు. నేటి తరం గిరిజన యువతకు వారి భాషపై మక్కువ కలిగేలా స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా ఐటీడీఏ ద్వారా అందించే ఆహ్వాన పత్రికలు, ప్రభుత్వ ఉద్యోగులకు అందించే ప్రశంసాపత్రాలు కోయ భాషలోనే ముద్రించామని వివరించారు. అనంతరం వధూవరులు మాట్లాడుతూ.. ఐటీడీఏ పీఓ రాహుల్ కోయ భాష నేర్చుకుని భావితరాలకు ఆదర్శంగా నిలిచారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఆగస్టు 3వ తేదీన పెళ్లి చేసుకోబోయే తాము వివాహ పత్రికను కోయ భాషలో ముద్రించామని చెప్పారు. కార్యక్రమంలో అధికారులు డేవిడ్ రాజ్, సున్నం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.