
రేషన్‌కార్డులతో ఆహారభద్రత
● 93లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీతో రికార్డు ● సమపాళ్లలో అభివృద్ధి, సంక్షేమం ● డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
బోనకల్: రేషన్‌కార్డుల ద్వారా పేదలకు ఆహార భద్రత లభిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. బోనకల్‌లో సోమవారం ఆయన నియోజకవర్గవ్యాప్తంగా ఇటీవల మంజూరైన రేషన్‌కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులు ఇవ్వకుండా పేదలను ఇబ్బంది పెట్టిందని ఆరోపించారు. కానీ తాము అధికారంలోకి రాగానే అర్హత కలిగిన పేదలందరికీ రేషన్‌కార్డులు ఇచ్చేలా చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో 1.15కోట్ల కుటుంబాలు ఉండగా 93లక్షల కుటుంబాలకు రేషన్‌కార్డులు ఇవ్వడమే కాక సన్నబియ్యం పంపిణీతో దేశంలోనే రికార్డు సృష్టించామని చెప్పారు. జిల్లాలో 19,690 కార్డులు కొత్తగా మంజూరు చేశామి, మధిర నియోజకవర్గంలో 4,736 కొత్త కార్డులు మంజూరు చేయడంతో పాటు 13,767 మంది పేర్లను చేర్చామని తెలిపారు. ఇక 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాతో రాష్ట్రంలో 51 లక్షల కుటుంబాలకు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపుతో 93 లక్షలకు లబ్ధి జరిగిందని వెల్లడించారు. కేవలం సంక్షేమ కార్యక్రమాలే కాక అభివృద్ధిని సమపాళ్లలో చేపడుతూ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలుపుతుమని డిప్యూటీ సీఎం భట్టి తెలపారు. తొలుత బోనకల్ మండలంలోని చిరునోములలో రూ.1.72కోట్లు, రావినూతలలో రూ.1.62కోట్లతో నిర్మించే సీసీ రోడ్లకు భట్టి శంకుస్థాపన చేశారు.
దశల వారీగా ఇందిరమ్మ బిల్లులు
చింతకాని: చింతకాని మండలం గాంధీనగర్ కాలనీలో రూ.20లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోమవారం ప్రారంభించారు. అలాగే, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా చేపట్టాలని, తద్వారా దశల వారీగా బిల్లులు మంజూరవుతాయని తెలిపారు. కాగా, డిప్యూటీ సీఎం భట్టి చింతకాని మండలంలోకి ప్రవేశించగానే భారీ వర్షం మొదలవడంతో ఆ వర్షంలోనే గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించాక రైతువేదికలో దళితబంధు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యం, వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు కస్తాల సత్యనారాయణ, నవీన్‌బాబు, సన్యాసయ్య, చందన్‌కుమార్, ధనసరి పుల్లయ్య, ఆశాలత, శ్రీనివాసాచారి, సునీల్‌రెడ్డి, ఆర్‌డీఓ నరసింహారావు, తహసీల్దార్లు కరుణాకర్‌రెడ్డి, రమాదేవి, ఎంపీడీఓలు శ్రీనివాసరావు, రమాదేవి, ఆత్మ, మార్కెట్ చైర్మన్లు కె.రామకోటేశ్వరరావు, బండారు నర్సింహారావు, ఏఓ మానసతో పాటు నాయకులు పైడిపల్లి కిషోర్, బందం నాగేశ్వరావు,గాలి దుర్గారావు, పిల్లలమర్రి నాగేశ్వరావు, షాజహాన్, జానీ మియా, బోయినపల్లి వెంకటేశ్వర్లు, మురళి, ముస్తఫా, శాస్త్రి, చేబ్రోలు వెంకటేశ్వర్లు, రామకృష్ణ, భద్రునాయక్, ప్రమీల పాల్గొన్నారు.