
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం/భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ద్రాక్షారామంలో రామయ్య కల్యాణం..
ఏపీలోని కోనసీమ జిల్లా ద్రాక్షారామం ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో భద్రాద్రి రామయ్య కల్యాణ మహోత్సవాన్ని శనివారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కల్యాణ వేడుకకు ఆలయ ఈఓ ఎల్.రమాదేవి హాజరై భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆలయ పీఆర్‌ఓ సాయిబాబు, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు.
రామయ్య సన్నిధిలో ఏపీ కమిషనర్..
శ్రీ సీతారామ చంద్ర స్వామి వారిని అమరావతి సెక్రటేరియెట్ ఆర్‌అండ్‌బీ కమిషనర్ రామసుందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదాలు అందజేశారు.