
రహదారులపై నెత్తుటిధారలు
కొత్తగూడెంటౌన్: రోడ్లు రక్తమోడుతున్నాయి. అతి వేగం, మద్యం మత్తులో, నిర్లక్ష్య డ్రైవింగ్‌తో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తెల్లవారు జామున, రాత్రి వేళ్లలో, మూలమలుపుల వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు భద్రతా చర్యలు తీసుకుంటున్నా, ట్రాఫిక్‌పై అవగాహన కల్పిస్తున్నా ఆశించినమేర ఫలితాలు రావడంలేదు. బ్లాక్‌స్పాట్లను గుర్తించి, ప్రమాదాలు జరగకుండా సూచికలు ఏర్పాటు చేస్తున్నామని పోలీస్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 2024 నుంచి 2025 ఈ నెల 10వ తేదీ వరకు 722 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిల్లో 344 మంది మృతి చెందగా, 331 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 535 మంది స్వల్ప గాయాలపాలయ్యారు. ఈ ఏడాది ఇప్పటివరకు 207 ప్రమాదాలు జరగ్గా, 95 మంది మృతి చెందారు. 194 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మద్యం మత్తులో అధిక ప్రమాదాలు
జాతీయ, రాష్ట్రీయ రహదారులపై వాహనాలను అతివేగం, అజాగ్రత్తగా నడుపుతుండటంతో ప్రమాదాలకు జరుగుతున్నాయి. లారీలు, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు పరిమితికి మించిన వేగంతో వెళ్తున్నాయి. పలువురు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారు. దీంతో అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాల సంఖ్య తగ్గడంలేదు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడినవారికి, ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినవారికి జరిమానాలు విధించినా మార్పు రావడంలేదు. అయితే ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ప్రాణనష్టంతోపాటు వైద్య ఖర్చులు
రోడ్డు ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడుతున్నారు. మృతి చెందినవారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇంటి పెద్దదిక్కు కోల్పోతే పిల్లల చదువులు, పెళ్లిళ్లు కూడా ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. మరికొందరు గాయపడి వైకల్యం పొందుతున్నారు. తీవ్ర గాయాలపాలైనవారు చికిత్స కోసం రూ. వేల నుంచి రూ. లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. వాహనదారులు కూడా ప్రమాదాల బారిన పడకుండా, కుటుంబాలను కష్టాలపాలు చేయకుండాతగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవసరం ఎంతైనా ఉంది.
నివారణ చర్యలు తీసుకుంటున్నాం
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. మద్యం తాగి, అతివేగంతో వాహనాలు నడపొద్దు. రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనదారులకు ట్రాఫిక్ నియమాలపై నిత్యం అవగాహన కల్సిస్తున్నాం. బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాద నివారణ చర్యలు చేపడుతున్నాం. –బి.రోహిత్‌రాజు, ఎస్పీ
అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్లే రోడ్డు ప్రమాదాలు
పలువురు మృత్యువాత, మరికొందరు గాయాలపాలు
రోడ్డున పడుతున్న, ఆర్థికంగా చితికిపోతున్న కుటుంబాలు
బ్లాక్ స్పాట్ల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టినా తగ్గని ప్రమాదాలు