
రాజ్యాంగ హక్కుల కోసం పోరాడుదాం
ఇల్లెందు: రాజ్యాంగ హక్కుల అమలు కోసం పోరాడుదామని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య తెలిపారు. శనివారం ఇల్లెందులో నిర్వహించిన అరుణోదయ రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అరుణోదయ కళాకారులు గళమెత్తాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ రాష్ట్ర అధ్యక్షుడు వేణు, ఉదయగిరి, రాజన్న, వెంకన్న, చిరంజీవి, జ్యోతి, స్వప్న, రాజన్న, లక్ష్మక్క, అభిగ్నో, శ్రీకాంత్, కిషన్, ఉమేష్, హరీష్, నాగమల్లు, కాంతారావు, కొండలరావు, కొండన్న, ఎన్డీ నేతలు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కేజీబీవీలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
జూలూరుపాడు: స్థానిక కేజీబీవీలో ఖాళీగా ఉన్న రెండు టీచింగ్ పోస్టు(గెస్ట్ ఫ్యాకల్టీ)ల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కేజీబీవీ ఎస్‌ఓ పద్మజ తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. సీఆర్‌టీ – ఇంగ్లిష్, పీజీసీఆర్‌టీ – జువాలజీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. అర్హులైన వారు ఆధార్ జిరాక్స్‌ను దరఖాస్తుకు జతచేసి 20వ తేదీ సాయంత్రం 4 గంటల లోగా కళాశాలలో దరఖాస్తులు అందించాలని తెలిపారు. సీఆర్‌టీ – ఇంగ్లిష్ పోస్టుకు రూ.18,000, పీజీసీఆర్‌టీ – జవాలజీ పోస్టుకు రూ.23 వేల వేతనం ఉంటుందన్నారు.
ఆ సీఐ వ్యవహారంపై విచారణ
ఖమ్మంక్రైం: ఖమ్మంలో శుక్రవారం మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీఆర్‌బీ సీఐ హడావుడి చేసిన అంశంపై పత్రికల్లో కథనాలు రావడం పోలీస్ శాఖలో చర్చకు దారి తీసింది. సదరు సీఐ వ్యవహారశైలిపై శాఖాపరంగా విచారణ మొదలుపెట్టినట్లు తెలిసింది. ఆయన తీరుపై నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. ఈమేరకు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ, ఖమ్మం పోలీస్ కమిషనర్ వేర్వేరుగా నివేదికలు ఇవ్వగా, సీఐకి భద్రాద్రి ఎస్పీ మెమో జారీ చేసినట్లు తెలిసింది.
పోక్సో బాధితులకు
అండగా ఉంటాం
పాల్వంచ: పోక్సో బాధితులకు అండగా ఉంటామని భరోసా సెంటర్ ఎస్‌ఐ చల్లా అరుణ అన్నారు. శనివారం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో పోక్సో కేసులు, బాలికల సాధికారత, హక్కులు, భరోసా సేవలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మానసిక, శారీరక ఇబ్బందులకు గురిచేస్తే తమకు సమాచారం ఇవ్వాలని విద్యార్థినులకు సూచించారు. భరోసా సెంటర్ అందుబాటులో ఉండి, అండగా నిలబడుతుందన్నారు. కార్యక్రమంలో అంబికా, అనూష, తులసి తదితరులు పాల్గొన్నారు.
బాలకార్మికుడి గుర్తింపు
చండ్రుగొండ : ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా చండ్రుగొండలో శనివారం నిర్వహించిన స్పెషల్‌డ్రైవ్‌లో ఓ మెకానిన్‌షెడ్‌లో పనిచేస్తున్న బాలకార్మికుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. సహాయ కార్మిక శాఖాధికారి ఎండీ షర్ఫుద్దీన్, చండ్రుగొండ, కొత్తగూడెం ఎస్‌ఐలు శివరామకృష్ణ, విజయకుమారి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మెకానిక్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివరామకృష్ణ తెలిపారు.
పేకాట స్థావరంపై దాడి
అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : మండలంలోని కంపగూడెం గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు శనివారం దాడి చేశారు. పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. రూ.20 వేల నగదు, బైక్, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు.
ఏడుగురిపై
కేసు నమోదు
పాల్వంచరూరల్: దాడి ఘటనలో ఏడుగురు వ్యక్తులపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఓర్సు గణేష్, గండుగుల రాజు హైదరాబాద్‌లో నివాసం ఉంటూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చిట్టీ డబ్బులు ఇవ్వాల్సి ఉండగా రాజు భార్యకు గణేష్ ఫోన్ చేసి అడిగాడు. ఇటీవల ఇద్దరూ గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో తన భార్యకు ఫోన్ ఎందుకు చేశావంటూ శనివారం పంచాయితీ పెట్టారు. పంచాయితీకి పెద్ద మనుషులను తీసుకొచ్చేందుకు వెళ్లగా తనపై రాజుతోపాటు మరో ఆరుగురు కలిసి దాడి చేశారని గణేష్ ఫిర్యాదు చేశాడు. దీంతో దాడిచేసిన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.