
అధికారులే బినామీలుగా..!
● పట్టణ పరిధిలో పలు అభివృద్ధి పనులు ● పాల్వంచ మున్సిపల్ డివిజన్‌లో అక్రమాలు? ● తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఏసీబీ సోదాలు ● ప్రైవేట్ వ్యక్తులతో జరిపిన లావాదేవీలపై ఆరా
పాల్వంచ: కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ డివిజన్‌లో అవినీతి, అక్రమాలు హెచ్చుమీరుతున్నాయి. పాలకవర్గం లేకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఇక్కడి అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. తాజాగా శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి శనివారం తెల్లవారుజామున ఆరు గంటల వరకు మరోసారి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.
ప్రైవేట్ ఉద్యోగులతో లావాదేవీలు
ఏసీబీకి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో తనిఖీలు చేపట్టగా, అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. కీలక పనులను ప్రైవేట్, చిరు ఉద్యోగుల ముసుగులో అధికారులే చేస్తున్నట్లు తెలుస్తోంది. శానిటేషన్, వాటర్ స్‌ౖప్ల, పలు అభివృద్ధి పనులు, రిపేర్ల పేరుతో భారీగా దండుకున్నట్లు సమాచారం. టెండర్లు పిలవకుండా నామినేషన్ పద్ధతిలో నిర్వహించిన పనుల్లో అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. ఒకరిద్దరి కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా చేసి, అధికారులు బినామీలుగా ఉండి పనులు చేయించినట్లు సమాచారం. సర్టిఫికెట్ల మంజూరు, నిర్మాణాల అనుమతుల విషయంలోనూ అవకతవకలు జరిగినట్లు, ప్రైవేట్ ఉద్యోగులను అడ్డుపెట్టుకుని ముడుపులు దండుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ ముఖ్యఅధికారి డ్రైవర్, ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులు, మరో అధికారి ఫోన్ పే, గూగుల్ పే లావాదేవీలను పరిశీలించారు. డ్రైవర్, అధికారి ఫోన్ పేల ద్వారా అధిక మొత్తంలో లావాదేవీలు జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల పెండింగ్ విషయంపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు. కాగా కొందరు ఉద్యోగులు ఆధారాలు చిక్కకుండా ముడుపులు దండుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
తెల్లవారుజామువరకు తనిఖీలు
శుక్రవారం ఉదయం కార్యాలయాన్ని దిగ్బంధనం చేసిన ఏసీబీ అధికారులు శనివారం తెల్లవారు జామున ఆరు గంటల వరకు తనిఖీలు కొనసాగించారు. దీంతో కమిషనర్ కె.సుజాత, మేనేజర్, టీపీఓ, శానిటేషన్, రెవెన్యూ సిబ్బందితో పాటు, ఇతర సిబ్బంది రాత్రంతా కార్యాలయంలో ఉండిపోవాల్సి వచ్చింది. పారిశుద్ధ్య వాహనాలకు ఆయిల్ వాడకం, రిపేర్లు తదితర అంశాలను కూడా పరిశీలించారు. మున్సిపాలిటీకి ఖాతా ఉన్న కేఎస్‌ఎంలోని పెట్రోల్ బంక్‌కు అర్ధరాత్రి వెళ్లి బిల్లులను సైతం తనిఖీ చేశారు. తనిఖీల్లో ఏసీబీ అధికారులకు పలు ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. సోదాలపై ఏసీబీ డీఎస్పీ వై.రమేష్‌ను వివరణ కోరగా.. తాము సేకరించిన ఆధారాలను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని, తనిఖీలు మళ్లీ ఎప్పుడైనా ఉండొచ్చని తెలిపారు.