
నిలిచిన తపాలా సేవలు
ఖమ్మంగాంధీచౌక్: తపాలా నిర్వహణలో నూతన సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్న క్రమాన శనివారం నుంచి పలు సేవలను నిలిపివేశారు. ఐటీ–2.0 పేరిట నూతనంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను ఈనెల 22వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా పోస్టాఫీసుల్లో అమలు చేయనున్నారు. ఇందుకోసం మార్పులు చేయాల్సి ఉండడంతో శనివారం, సోమవారం పలు విభాగాల్లో సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో డిపాజిట్లు, విత్ డ్రాతో పాటుఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు(ఐపీపీబీ) సేవలే కాక ఆధార్ ఆధారంగా నగదు విత్ డ్రా నిలిచిపోయింది. సురక్షితంగా, వేగవంతమైన సేవలందించేలా తపాలా శాఖ దేశవ్యాప్తంగా పోస్టాఫీసుల్లో ఐటీ–2.0 సాఫ్ట్‌వేర్ అమలుకు సిద్ధమైన అధికారులు, రెండు రోజుల పాటు లావాదేవీల్లో అంతరాయం ఏర్పడుతుందని ముందుగానే ప్రకటించారు. ఈమేరకు శనివారం ఖమ్మం తపాలా డివిజన్ కార్యాలయం, డివిజన్ పరిధిలోని 10 సబ్ డివిజన్ కార్యాలయాలు, ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం హెడ్ పోస్టాఫీసులే కాక 70 సబ్ పోస్టాఫీసులు, 750 బ్రాంచ్ పోస్టాఫీసుల్లో ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. తిరిగి 22వ తేదీ నుంచి అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. కాగా, ఉత్తరాల బట్వాడా మాత్రం కొనసాగుతోందని వెల్లడించారు.