
మహిళ ఆత్మహత్య
పాల్వంచ: భర్త వదిలేసి పోవడంతో మానసిక ఇబ్బందులు తాళలేక శనివారం ఓ మహిళ చెరువులో పడి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల, స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన గోకినపల్లి విజయ(38)ను భర్త 18 ఏళ్ల క్రితం వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె ఇళ్లలో పనిచేసుకుంటూ కూతురు, కుమారుడిని సాకుతోంది. కొద్దిరోజుల నుంచి మతిస్థిమితం కోల్పోతోంది. రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు యత్నించగా, కుటుంబ సభ్యులు సర్ది చెప్పారు. రోజులానే శనివారం ఉదయం ఇళ్లలో పనిచేసేందుకు వెళ్లి మధ్యాహ్నం వరకు ఇంటికి రాలేదు. దీంతో కూతురు శ్రీలేఖ, కుమారుడు శ్రీకాంత్, తల్లి సిద్దుల చుక్కమ్మ, తమ్ముడు రాంబాబులు వెతకగా, పాత పాల్వంచ చింతల చెర్వులో మృతదేహం లభ్యమైంది. పోలీసులకు సమాచారం ఇవ్వగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా తమను అనాథలను చేసి వెళ్లిపోయావా అమ్మా.. అంటూ మృతదేహం వద్ద పిల్లలు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.