
మంత్రులకే మోడల్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయి. భారీగా సబ్సిడీలు అందిస్తున్నాయి. అయినా ఆశించిన స్థాయిలో సౌర విద్యుత్ యూనిట్ల స్థాపనకు ప్రజల నుంచి స్పందన రావడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మోడల్ సోలార్ విలేజ్ పేరుతో ఎంపిక చేసింది. ఆయా గ్రామాల్లో గృహ, వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా ప్రతీ ఇంటికి సోలార్ యూనిట్లను సర్కారు ఖర్చుతో ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 80 గ్రామాలను ఎంపిక చేయగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 28 ఉన్నాయి. ఈ గ్రామాల పరిధిలో ఇంటికై తే 2 కిలోవాట్స్, వ్యవసాయ మోటార్లకు 7.50 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ యూనిట్లను లబ్ధిదారులకు అందించనుంది.
అన్నీ ఖమ్మం జిల్లాకే..
ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 28 గ్రామాలను మోడల్ సోలార్ విలేజ్ పథకానికి ఎంపిక చేశారు. ఇందులో 27 గ్రామాలు ఖమ్మం జిల్లా పరిధిలో ఉండగా, భద్రాద్రి జిల్లాలో ఒకే ఒక్కటి ఉండడం గమనార్హం. ఖమ్మం జిల్లాలో ఎంపికై న 27 గ్రామాల్లో 22 బోనకల్ మండలంలోనే ఉన్నాయి. ఈ మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో గృహ, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సోలార్ యూనిట్లు ఉచితంగా ఏర్పాటుచేయనున్నారు. ఇక మధిర మండలం సిరిపురం, పాలేరు నియోజకర్గంలోని చెరువుమాధారం, ఖమ్మం నియోజకర్గంలో రఘునాథపాలెం, వైరా నియోజకర్గంలో స్నానాల లక్ష్మీపురం, శ్రీరామగిరి గ్రామాలు ఉన్నాయి. భద్రాద్రి జిల్లాలో దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామానికి మాత్రమే అవకాశం దక్కింది.
మంత్రులకే పెద్దపీట..
మోడల్ సోలార్ విలేజ్ పథకానికి ఎంపికై న గ్రామాలను పరిశీలిస్తే మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు, వారి సొంత గ్రామాలకే చోటుదక్కింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న బోనకల్ మండలంలో 22 గ్రామాలు, మధిర మండలం సిరిపురం ఈ పథకం పరిధిలోకి వచ్చాయి. ఆయన సొంతూరైన వైరా నియోజకర్గంలోని లక్ష్మీపురంతో పాటు శ్రీరామగిరి కూడా ఉన్నాయి. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహించే నేలకొండపల్లి మండలం చెరువుమాధారం, తుమ్మల నాగేశ్వరరావు ప్రాతనిధ్యం వహిస్తున్న రఘునాథపాలెంతో పాటు ఆయన సొంతూరైన గండుగులపల్లికి అవకాశం దక్కింది. తుమ్మల సొంతూరు భద్రాద్రి జిల్లా కాకుంటే ఆ ఒక్క గ్రామానికి కూడా చోటు లభించేది కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా సోలార్ యూనిట్లు
మోడల్ విలేజ్ పథకంలో
ఏజెన్సీ జిల్లాపై వివక్ష
తొలి దశలో మంత్రుల
నియోజకర్గాల్లోని గ్రామాలకే చోటు
ఉమ్మడి జిల్లాకు 28..
భద్రాద్రికి దక్కింది ఒక్కటే
ఏజెన్సీ జిల్లాపై పట్టింపేది ?
ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో పది అసెంబ్లీ స్థానాలకు గాను ఖమ్మంలో ఐదు, భద్రాద్రిలో ఐదు ఉన్నాయి. ముఖ్యంగా భద్రాద్రి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమే ఎక్కువ. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన గిరిజన గ్రామాలు, ఆ సామాజిక వర్గ జనాభానే అధికంగా ఉన్నారు. ప్రభుత్వం తరఫున అమలయ్యే ప్రోత్సాహకాలు, సంక్షేమ పథకాల్లో ఈ జిల్లాకు కచ్చితంగా చోటు కల్పించాలి. కానీ అందుకు భిన్నంగా ఖమ్మం జిల్లాకే, అందులోనూ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకే అన్ని పథకాల్లో ప్రాధాన్యత దక్కుతుండటం విమర్శలకు తావిస్తోంది. మోడల్ సోలార్ విలేజ్ పథకంలో ఇల్లెందు, భద్రాచలం, పినపాక, కొత్తగూడెం, సత్తుపల్లి నియోజకర్గాల నుంచి ఒక్క గ్రామాన్ని కూడా చేర్చకపోవడాన్ని పలువురు తప్పు పడుతున్నారు.