
మహిళల అభివృద్ధే లక్ష్యం
ఇల్లెందు : మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ పేదవాడికీ ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. ఇల్లెందులోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌లో గురువారం నిర్వహించిన ఇందిరమ్మ మహిళా శక్తి సంబరాల కార్యక్రమానికి మంత్రి ధనసరి సీతక్కతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలకు 18 నెలల్లో రూ.856 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించామని, ఇప్పుడు వారిని బస్సులకు యజమానులుగా చేస్తున్నామని చెప్పారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, నెలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించిన చరిత్ర ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. ఇప్పటికే 60 వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించామని, త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు అందిస్తామని అన్నారు. ఇన్ని పథకాలు అమలు చేసిన కాంగ్రెస్ పార్టీని వచ్చే స్థానిక ఎన్నికల్లోనూ ఆశీర్వదించాలని కోరారు.
పురుషులపై ఆధారపడకుండా..
మహిళలు పురుషులపై ఆధారపడకుండా స్వఽశక్తితో ఎదగాలనే లక్ష్యంతో ఇందిరమ్మ రాజ్యం పని చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క తెలిపారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కంకణం కట్టుకున్నారని, ఆ దిశగా మహిళామణుల కోసం సెర్ప్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని చెప్పారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే సమాజాభివృద్ధి సాధ్యమన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం మహిళల ఆర్థిక స్వావలంబనకు మార్గంగా మారుతుందని అన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందుతుండడంతో సభ్యుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని చెప్పారు. ఒకప్పుడు ఏ పని చేయాలన్నా వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చేదని, ఇప్పుడు మహిళలకు ప్రభుత్వమే ప్రోత్సాహకాలు అందిస్తోందని వివరించారు. అనంతరం మహిళలకు ఇందిరమ్మ ఇంటి మంజూరుపత్రాలతో పాటు వడ్డీ లేని రుణాలు, బీమా, బ్యాంక్ లింకేజీ తదితర రూ.34 కోట్ల చెక్కులను మంత్రులు పొంగులేటి, సీతక్క అందజేశారు. కార్యక్రమంలో ఇల్లెందు, భద్రాచలం ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావు, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, ఐటీడీఏ పీఓ రాహుల్, ఎస్పీ రోహిత్‌రాజ్, మహబూబాబాద్ ఆర్డీఓ మధుసూదన్‌రాజ్, కొత్తగూడెం ఆర్డీఓ మధు, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, తహాసీల్దార్ రవి, ఎంపీడీఓ ధన్‌సింగ్, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, డీఎస్‌ఓ రుక్మిణీ, సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ రాజ్యంలో
పేదలందరికీ ఇళ్లు..
కోటి మంది నారీమణులను
కోటీశ్వరులను చేస్తాం
మంత్రులు పొంగులేటి, సీతక్క
ఇల్లెందులో ఘనంగా
మహిళా శక్తి సంబురాలు

మహిళల అభివృద్ధే లక్ష్యం