
రామయ్య భూములు దక్కేనా ?
● పురుషోత్తపట్నంలో పర్యటించిన పీఠాధిపతి ● స్థానికులతో చర్చలు.. భూములు తమవేనంటున్న రైతులు ● అన్యమతస్తుల నుంచి భూమి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ ● రాముడి భూమి ఆలయానికే చెందాలన్న శ్రీనివాసానంద స్వామిజీ
భద్రాచలం: భద్రాద్రి రామయ్యకు చెందిన ఏపీలోని పురుషోత్తపట్నం భూములపై రచ్చ కొనసాగుతూనే ఉంది. దేవాదాయ శాఖకు చెందిన భూములను స్వాధీనం చేయాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని రామాలయ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాముడికి చెందిన భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతుండడం, వాటిని ఆలయ వర్గాలు అడ్డుకోవడంతో ఘర్షణలతో ఉద్రిక్తత నెలకొంటోంది. కాగా, ఏపీలోని ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీతో పాటు బీజేపి నాయకులు పురుషోత్తపట్నంలో గురువారం పర్యటించి గ్రామస్తులు, రైతులతో మాట్లాడారు.
అన్యమత సంస్థకు ఎలా అప్పగించారు..?
ఎన్నో ఏళ్లుగా భూములు సాగు చేసుకుంటున్న తాము రామాలయానికి కౌలు చెల్లిస్తున్నామని, రాముడిపై ఆధారపడి జీవిస్తున్న తమకు అన్యాయం చేయొద్దని స్థానిక రైతులు అన్నారు. అయితే ఆలయానికి చెందిన 12 ఎకరాల భూమిని ఉమ్మడి ఏపీలోని నాటి టీడీపీ ప్రభుత్వం ఓ అన్యమత సంస్థకు ఎలా అప్పగించిందని ప్రశ్నించారు. మొదట ఆ భూమిని స్వాధీనం చేసుకున్నాకే తమ వద్దకు రావాలని అన్నారు. రాముడికి తాము వ్యతిరేకం కాదని, అందరికీ సమన్యాయం జరగాలని, ఈ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.
భూమి రాముడికే చెందాలి..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న భద్రాద్రి రామయ్యకు చెందిన భూములు స్వామివారికే దక్కాలని శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీ అన్నారు. పురుషోత్తపట్నంలో పర్యటన తర్వాత భద్రాచలంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇరు రాష్ట్రాలకు చెందిన సున్నితమైన అంశాన్ని శాంతియుతంగా పరిష్కరించాలని సూచించారు. ఇటు ఆలయానికి, అటు రైతులకు సమన్యాయం జరిగేలా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నివేదిక ఇస్తామన్నారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి దేవాదాయ శాఖకు శాశ్వత స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. అన్యమత సంస్థకు కేటాయించిన భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని, అక్కడ నుంచే ఆక్రమణల తొలగింపును ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సాధుపరిషత్ గౌరవాధ్యక్షులు అట్లూరి నారాయణరావు మాట్లాడుతూ.. రాముడికి చెందిన భూముల స్వాధీనంపై ఇరు రాష్ట్రాల సీఎంలు స్పందించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఏపీ సాధు పరిషత్ గౌరవ సలహాదారు కురిచేటి రామచంద్రమూర్తి పాల్గొన్నారు. కాగా, తొలుత భద్రాచలం వచ్చిన ఈ బృందం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. పండితులు వారికి వేదాశీర్వచనం అందజేశారు.