
యూరియా కోసం బారులు..
తెల్లవారుజాము నుంచే
విక్రయ కేంద్రానికి రైతులు
ఇల్లెందురూరల్ : వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో యూరియా కోసం రైతులు విక్రయ కేంద్రాల వద్ద బారులు దీరుతున్నారు. బుధవారం తెల్లవారుజామునే ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు చేరుకుని పడిగాపులు కాశారు. రెండు రోజులుగా తిరుగుతున్నా యూరియా లభించలేదని, అందుకే తెల్లారకముందే విక్రయ కేంద్రానికి చేరుకున్నామని రైతులు చెబుతున్నారు. అయితే రోజుకు 300 మంది రైతులకు సరపడా మాత్రమే దిగుమతి అవుతుండడం, అంతకు మించి రైతులు రావడంతో అధికారులకు కూడా సమస్యగా మారుతోంది. దీంతో గురువారం నుంచి నిబంధనలు సడలించాలని పీఏసీఎస్, వ్యవసాయ శాఖల అధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకు ఆధార్ కార్డు జిరాక్స్ సమర్పిస్తే యూరియా ఇచ్చేవారు. దీంతో రైతులు కుటుంబంలోని సభ్యులందరినీ తీసుకొచ్చి యూరియా కొనుగోలు చేస్తున్నారు. ఈ కారణంగా నిబంధనలు సడలించినట్లు అధికారులు తెలిపారు. గురువారం నుంచి ఆధార్ కార్డు జిరాక్స్ పత్రంతోపాటు పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ కూడా వెంట తెచ్చుకుంటేనే యూరియా విక్రయిస్తామని స్పష్టం చేస్తున్నారు. కాగా, ఆన్‌లైన్ అనుమతులు రాగానే కొమరారంలో కూడా యూరియా విక్రయాలు ప్రారంభిస్తామని ఏఓ సతీష్ తెలిపారు.