చింతకాని: మండలంలోని నాగులవంచ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) ప్రగతి పథంలో కొనసాగుతోంది. రైతులకు పంట రుణాల పంపిణీ, ఎరువులు, విత్తనాల సరఫరా చేయడమే కాక ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తోంది. అలాగే, రైతులకు ఆన్‌లైన్ సర్వీసుల కోసం గతేడాది కామన్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేయడంతో సేవలు విస్తృతమయ్యా యి. 15 ఏళ్లుగా సంఘం లాభాల బాటలో నడుస్తుండడంతో తాజాగా నాబార్డు ఉత్తమ సొసైటీగా అవార్డు ప్రకటించింది. హైదరాబాద్‌లో మంగళవా రం ఈ అవార్డును సొసైటీ చైర్మన్, సీఈఓ అందుకున్నారు.
30 మంది సభ్యులతో ఏర్పాటు
నాగులవంచ పీఏసీఎస్ పరిధిలో నాగులవంచ, చిన్నమండవ, సీతంపేట, తిమ్మినేనిపాలెం, తిరుమలాపురం, నాగులవంచ రైల్వేకాలనీ, రేపల్లెవాడ గ్రామాలు ఉన్నాయి. 1963 నవంబర్ 6వ తేదీన 30 మంది సభ్యులతో రూ.6 వేల వాటాధనంతో సొసై టీ ఏర్పడగా ఇప్పుడు 2,400 మంది సభ్యులు, రూ.1.22 కోట్లు వాటాధనం కలిగి ఉంది. పీఏసీఎస్ ద్వారా 1,198 మంది రైతులకు 2025–26 ఖరీఫ్ సీజన్‌కు రూ.8.64 కోట్లు పంట రుణాలు ఇవ్వడమే కాక మరో 110 మంది రైతులకు రూ.60 లక్షలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సంఘంలోని 950 మంది రైతులు సేవింగ్ డిపాజిట్ల కింద రూ.42.50 లక్షలు పొదుపు చేసుకున్నారు. అలాగే 870మంది రైతుల డిపాజిట్లు రూ.1.26కోట్లు ఉన్నా యి. పీఏసీఎస్ ద్వారా పంటరుణాలు తీసుకున్న 1,162 మందిలో 824 మందికి రూ.6.02 కోట్ల మేర రుణమాఫీ అయింది.
నికర ఆదాయం రూ.1.20 కోట్లు
సంఘం ప్రస్తుత నికర ఆదాయం రూ.1.20 కోట్లుగా నమోదైంది. డీసీసీబీలో వాటాధనం రూ.1.50 లక్షలు ఉండగా, డిపాజిట్లు రూ.1.95 కోట్లు ఉన్నాయి. 2024 ఖరీఫ్ సీజన్ నుంచి పీఏసీఎస్ ద్వారా రూ.5.50 కోట్ల విలువైన ఎరువులు, విత్తనాల వ్యాపారం నిర్వహించారు. అలాగే, 600 మంది రైతుల వద్ద నుంచి గత రెండేళ్ల కాలంలో రూ.20.50 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశారు.
గోదాం నిర్మాణం
సంఘంలో సభ్యులైన రైతులు పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేలా సొసైటీ ఆవరణలో అగ్రి డెవలప్‌మెంట్ స్కీం కింద నాబార్డు అందజేసిన రూ.60 లక్షలతో వెయ్యి మెట్రిక్ టన్నుల సామర్థ్యం కల్గిన గోదాంను మూడేళ్ల కిందట నిర్మించారు. ఇందులో 15 మంది రైతులు 995 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు నిల్వ చేసి తనఖా రుణంగా రూ.80 లక్షలు తీసుకున్నారు. 2009–10లో 350 సభ్యులు ఉన్న సమయాన పీఏసీఎస్‌కు రూ.25 లక్షల నష్టం రాగా.. అప్పటి నుంచి వెనుతిరిగి చూడకుండా అభివృద్ధి బాటలో పయనిస్తుండడంతో నాబార్డు అవార్డు ప్రకటించింది.
ప్రగతి పథంలో
నాగులవంచ సొసైటీ
పీఏసీఎస్‌లో 2,400 మంది సభ్యులు..
ప్రస్తుతం రూ.1.20 కోట్ల ఆదాయం
రుణాలు, పంటల కొనుగోళ్లలో
రైతులకు చేయూత
నాబార్డు నుంచి ఉత్తమ సొసైటీగా అవార్డు