
గ్రామాల్లో కంటైనర్ ఆస్పత్రులు..
దుమ్ముగూడెం: మండలంలోని పర్ణశాల పీహెచ్‌సీ పరిధి కాశీనగరం ఆరోగ్య ఉపకేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా, కంటైనర్ వైద్యశాలగా మార్చింది. ఇక్కడి ఆరోగ్యఉప కేంద్రం భవనం మరమ్మతులకు గురైంది. దీంతో కంటైనర్ ఆస్పత్రి ఏర్పాటుకు అధికారులు మొగ్గుచూపారు. జిన్నెలగూడెం గ్రామంలోనూ కంటైనర్ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని భావించగా, అక్కడ ప్రభుత్వ స్థలం అందుబాటులో లేదు. దీంతో కాశీనగరంలో మాత్రమే నిర్మాణ పనులు చేపట్టారు. దాదాపు పనులు పూర్తి కావొచ్చాయి. విద్యుత్‌కు సంబంధించిన పనులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలోని ఆళ్లపల్లి, గుండా ల, వినాయకపురంలలో కూడా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. కంటైనర్ ఆస్పత్రులు అందుబాటులోకి వస్తే మెరుగైన వైద్యసేవలు అందుతాయని చెబుతున్న వైద్యాధికారులు.. వాటి నిర్మాణానికి ఎన్ని నిధులు ఖర్చు చేస్తున్నారనే విషయం మాత్రం వెల్లడించడంలేదు.
ఇవీ సదుపాయాలు
కంటైనర్ వైద్యశాలలో ఓ బెడ్, ఫ్యాన్, సిబ్బంది కోసం టేబుల్, విద్యుత్ సదుపాయం కల్పించనున్నారు. మరుగుదొడ్డిని పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రాథమిక వైద్యం అందించేందుకు వైద్య సిబ్బందిని, మందులను, వైద్య పరికరాలను సమకూర్చనున్నారు.అత్యవసర మందులను సైతం అందుబాటులో ఉంచనున్నారు. కంటైనర్ ఆస్పత్రుల్లో ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు నిత్యం అందుబాటులో ఉండనున్నారు. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు తగిన ఏర్పాట్లను కల్పిస్తున్నారు. మలేరియా, డెంగీ జ్వరాల నిర్ధారణ పరీక్షలు సైతం చేయనున్నారు. గర్భిణులకు కూడా వైద్యం అందించనున్నారు. అవసరాన్ని బట్టి సమీప పీహెచ్‌సీ వైద్యులు వచ్చి సేవలు అందించనున్నారు.
జిల్లాలోని నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటు
కాశీనగరంలో పూర్తికావొచ్చిన
నిర్మాణ పనులు
ప్రజలకు అందుబాటులో వైద్యం
ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కంటైనర్ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల తక్షణ వైద్య సహాయం అందుతుంది. వీటి పురోగతిని పరిశీలించాక మిగతా ప్రాంతాల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపుతాం.
–డాక్టర్ రేపాక చైతన్య, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ

గ్రామాల్లో కంటైనర్ ఆస్పత్రులు..