
‘తపాలా’లో నూతన సాంకేతికత
● 22వ తేదీ నుంచి ఐటీ–2.0 అమలు ● 19, 21వ తేదీల్లో సేవలకు అంతరాయం
ఖమ్మంగాంధీచౌక్: తపాలా శాఖ నిర్వహణలో మార్పులు తీసుకొస్తున్నారు. సురక్షితమైన సేవల కోసం అధునాతన సాంకేతిక విధానం అమలుకు రంగం సిద్ధం చేశారు. తపాలా శాఖ కార్యాలయాల ద్వారా సేవలన్నింటినీ ఒకే ప్లాట్‌ఫామ్‌పై అమలుకు నిర్ణయించిన నేపథ్యాన ఐటీ–2.0 పేరుతో నూతన సాఫ్ట్‌వేర్ రూపొందించారు. ఈ స్టాఫ్‌వేర్ కార్యకలాపాల డేటా భద్రతను పెంచుతుందని చెబుతున్నారు. అలాగే, ఉద్యోగుల పని సామర్ధ్యం పెరగడమే కాక సేవలు మెరుగవుతాయని భావిస్తున్నారు.
తెలంగాణ సర్కిల్ అంతటా...
ఐటీ–2.0ను ఈనెల 22వ తేదీ నుంచి తపాలా శాఖ తెలంగాణ సర్కిల్ వ్యాప్తంగా అమలు చేయనుంది. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంతో మన రాష్ట్రంలోని హైదరాబాద్ సర్కిల్, తెలంగాణ సర్కిల్‌లోని నల్లగొండ తపాలా డివిజన్‌లో అమలు చేస్తున్నారు. ఈనెల 22 నుంచి తెలంగాణ సర్కిల్ అంతటా అమలుకు నిర్ణయించారు. ఖమ్మం తపాలా డివిజనల్ ఆఫీస్, 10 సబ్ డివిజనల్ కార్యాలయాలు, కొత్తగూడెం, భద్రాచలం, ఖమ్మం హెడ్ పోస్టాఫీసులు, 70 సబ్ సోస్టాఫీసులు, 750 బ్రాంచ్ ఆఫీసుల్లో ఐటీ–2.0 సేవలు అందుబాటులోకి రానుండగా, ఇప్పటికే ఉద్యోగులు, సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు.
రెండు రోజులు సేవలకు బ్రేక్
కొత్త సాంకేతిక విధానాన్ని ప్రవేశపెడుతున్న నేపథ్యాన ఈనెల 19, 21 తేదీల్లో తపాలా సేవలు నిలిపివేస్తున్నట్లు ఖమ్మం డివిజన్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి తెలిపారు. ఈ విషయాన్ని వినియోగదారులు, ఖాతాదారులు గమనించాలని, 22వ తేదీ నుంచి నూతన సాంకేతికత అమల్లోకి వస్తుందని తెలిపారు.