
ఆదివాసీలకు మెరుగైన వైద్య సేవలు
భద్రాచలం ఎమ్మెల్యే
డాక్టర్ తెల్లం వెంకట్రావు
చర్ల: ఆదివాసీ గ్రామాల్లో మెరుగైన వైద్య సేవలందించేందుకు మొబైల్ వైద్యశాలలు, ప్రత్యేక అంబులెన్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు తెలిపారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల అభివృద్ధి నిధులు రూ.1.50 కోట్లతో మండలంలోని పూసుగుప్పలో ఏర్పాటు చేసిన మొబైల్ వైద్యశాల, అంబులెన్సులను ఆయన కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజులతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొబైల్ ఆస్పత్రితో పూసుగుప్ప, వద్దిపేట, ఉంజుపల్లి గ్రామాలతోపాటు ఛత్తీస్‌గఢ్‌లోని సరిహద్దు గ్రామాలకు వైద్య సేవలు అందుతాయన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు కూడా మాట్లాడారు. సీఆర్‌పీఎఫ్ కమాండెంట్ ఎంకే సింగ్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, సీఐలు ఏ.రాజువర్మ, సీహెచ్ శ్రీనివాస్, ఈ.శ్రీనివాస్, తహశీల్దార్ ఎం శ్రీనివాస్, ఎంపీడీఓ ఈదయ్య, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ్, వైద్యాధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.