
పని చేసే ప్రతీ కూలీకి నగదు ఇవ్వాలి
గుండాల: గ్రామీణ ఉపాధి హామీ పనులు చేసిన ప్రతీ ఒక్క కూలీకి డబ్బులు చెల్లించాలని, పనులు జరిగే ప్రదేశాలకు సిబ్బంది వెళ్లాలని అడిషనల్ డీఆర్‌డీఓ రవి అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో 16వ విడత ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఏడాది కాలంగా నిర్వహించిన ఉపాధి హామీ పనుల వివరాలను తనిఖీ బృందం వెల్లడించింది. అన్ని గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో రిజిస్టర్లలో తప్పులు, మెయింటెనెన్స్ లేకపోవడం, కూలీలకు డబ్బులు చెల్లించడంలో జాప్యం ఏర్పడడం గుర్తించామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనుల్లో భాగంగా పలువురి నుంచి రూ.14,610 రికవరీతో పాటు, నిర్లక్ష్యం కారణంగా రూ.11 వేలు జరిమానా విధించామని తెలిపారు. పనులు జరిగే ప్రాంతాలకు వెళ్లి ఎప్పటికప్పుడు మట్టర్లు వేయడం, పనులను పర్యవేక్షించడం, కంప్యూటర్లలో నమోదు చేస్తే తప్పులు జరిగే ప్రసక్తి ఉండదని చెప్పారు. అవినీతికి పాల్పడినా, అలసత్వం వహించినా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సమావేశంలో డీవీఓ రమణ, ఎంపీడీఓ బాలరాజు, ఏవీఓ అనూష, ఆర్‌ఆర్‌పీ సుశీల, ఎంపీఓ శ్యాంసుందర్, ఏపీఓ రవితేజ, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.