
‘ఉద్దీపకం’తో గుణాత్మక విద్య
భద్రాచలంటౌన్: గిరిజన సంక్షేమ ఆశ్రమ, జీపీఎస్ విద్యార్థులకు ఉద్దీపకం వర్క్ బుక్‌తో గుణాత్మక విద్య అందించే అవకావం ఉంటుందని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. స్థానిక బీఈడీ కళాశాలలో ఏహెచ్‌ఎస్, ఏపీఎస్, జీపీఎస్ పాఠశాలల ఎస్జీటీలకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులకు కనీస సామర్థ్యాలు అర్థమయ్యేలా నిష్ణాతులైన ఉపాధ్యాయుల సలహాలు, సూచనలతో వర్క్‌బుక్‌లను రూపొందించామని చెప్పారు. 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు గుణకారాలు, భాగాహారాల్లో నైపుణ్యం పెంచేలా ఉపకరిస్తోందని వివరించారు. 1, 2 తరగతుల వారికి తెలుగు, 3 నుంచి 7వరకు ఇంగ్లిష్, గణితం వర్క్‌బుక్‌లు రూపొందించామని చెప్పారు. ఉపాధ్యాయులు శిక్షణను సద్వినియోగం చేసుకుని, చదువులో వెనుకబడిన విద్యార్థులను మెరుగుపర్చాలని సూచించారు. అనంతరం బీఈడీ, డీఈడీ కళాశాలల డార్మెటరీ గదులను పరిశీలించారు. ఏమైనా మరమ్మతులు చేయాల్సి ఉంటే ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీడీ మణెమ్మ, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ వీరు నాయక్, ఏసీఎంఓలు రమేష్, శ్రీరాములు, ఏటీడీఓలు అశోక్ కుమార్, రాధమ్మ, సీఆర్పీలు వరబాబు, శంకర్, మోతీలాల్, అలివేలు మంగతాయారు తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్
వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా చర్యలు తీసుకోవాలని, వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని పీఓ రాహుల్ సూచించారు. మారుమూల మండలాల సబ్ యూనిట్ అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి, బాధితులకు చికిత్స చేయాలన్నారు. ఏజెన్సీ ఏరియాలోని 113 హైరిస్క్ గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు వహించేలా ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు ఉన్నట్లు తేలితే మందులు అందించడంతో పాటు ఆయా గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి, ఏడీఎంహెచ్‌ఓ చైతన్య, మలేరియా అధికారి స్పందన తదితరులు పాల్గొన్నారు.