
పంట చేలల్లోకి వన్యప్రాణి సాంబారు
చండ్రుగొండ: మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన బెండాలపాడు శివారు కనకగిరి అటవీప్రాంతం నుంచి పంట చేలల్లోకి ఓ వన్యప్రాణి మంగళవారం వచ్చి మృత్యువాత పడింది. రైతుల కథనం ప్రకారం.. అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చి పరుగులు తీస్తున్న ఓ వన్యప్రాణిని కొందరు రైతులు గమనించారు. మనుషుల్ని చూసిన ఆ జీవి పొలం ఫెన్సింగ్‌లో చిక్కుకుంది. అప్పటికే గాయలపాలై అచేతనంగా ఉన్న ఆ ప్రాణి చూస్తుండగానే కుప్పకూలి తుదిశ్వాస విడిచింది. సమాచారం అందుకున్న బేస్‌క్యాంప్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వన్యప్రాణి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేంజర్ ఎల్లయ్యను వివరణ కోరగా వన్యప్రాణి (సాంబారు) అడవి నుంచి బయటకు వచ్చి మృతి చెందిన విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపామన్నారు. పోస్టుమార్టం అనంతరం ఆ ప్రాణిని ఖననం చేస్తామని తెలిపారు.
జనాల్ని చూసి బెదిరి ఫెన్సింగ్ తీగల్లో చిక్కుకుని మృత్యువాత

పంట చేలల్లోకి వన్యప్రాణి సాంబారు