
పెద్దమ్మతల్లి ఆలయంలో రేపు చండీహోమం
పాల్వంచరూరల్ : మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా గురువారం చండీహోమం నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హోమంలో పాల్గొనే భక్తులు రూ.2,516 చెల్లించి గోత్ర నామాలను నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు 6303408458 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
ఈఓపై దాడిని ఖండించిన మంత్రి తుమ్మల
భద్రాచలంటౌన్ : భద్రాచలం రామాలయ ఈఓ రమాదేవిపై ఏపీలోని పురుషోత్తపట్నం గ్రామానికి చెందిన భూ ఆక్రమణదారులు దాడి చేయడాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖండించారు. ఈఓను ఫోన్‌లో పరామర్శించిన ఆయన.. ఈ ఘటన దురదృష్టకరమని అన్నారు. దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను ఆదేశించారు. ఆలయ భూముల విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించి దేవాలయానికి చెందేలా చర్యలు తీసుకుంటారని, ఆ భూములు దక్కితేనే ఆలయ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. కాగా, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, కమిషనర్ కూడా ఈఓకు ఫోన్ చేయగా, స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు నేరుగా పరామర్శించారు.
ఆలయ ఉద్యోగుల ఖండన..
ఈఓ రమాదేవిపై జరిగిన దాడిని యాదగిరిగుట్ట, వేములవాడ ఆలయాల ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులు, తీవ్ర పదజాలంతో దూషించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విధులకు హాజరు కండి
సింగరేణి కార్మికులకు డైరెక్టర్(పా) పిలుపు
సింగరేణి(కొత్తగూడెం): సమ్మెలో పాల్గొనకుండా విధులకు హాజరై బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు సహకరించాలని సింగరేణి డైరెక్టర్(పా) గౌతమ్ పొట్రు, డైరెక్టర్(పీఅండ్‌పీ) కె.వెంకటేశ్వరరావు, కొత్తగూడెం ఏరియా జీఎం ఎం.శాలెంరాజు కార్మికులను కోరారు. బుధవారం దేశవ్యాప్త సమ్మెకు పలు సంఘాలు పిలుపు నిచ్చిన నేపథ్యంలో.. తమ కార్యాలయాల్లో మంగళవారం వేర్వేరుగా నిర్వహించిన సమావేశాల్లో వారు మాట్లాడారు. జాతీయ కార్మిక సంఘాలు చేస్తున్న డిమాండ్లలో ఒక్కటి కూడా సింగరేణికి సంబంధించినది లేదని తెలిపారు. ఇప్పటికే వివిధ కారణాలతో బొగ్గు ఉత్పత్తి, ఓబీ తొలగింపులో కొంత వెనకబడి ఉన్నామని, ప్రస్తుతం వర్షాకాలం అయినందున జూలై, ఆగస్టు నెలల్లో ఉత్పత్తికి మరింతగా అంతరాయం ఏర్పడుతుందని అన్నారు. ఈ విషయాలను కార్మికులు గమనించి సమ్మెకు దిగకుండా విధులకు హాజరు కావాలని కోరారు.
బాధితుల సమస్యలు పరిష్కరించాలి
కొత్తగూడెంఅర్బన్: ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా నిరంతరం అప్రమత్తం చేస్తూ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. కొత్తగూడెం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించాక మాట్లాడుతూ.. వివిధ సమస్యలతో వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చేలా బాధ్యతగా మెలగాలని సిబ్బందికి సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని, డయల్ 100కు ఫోన్ రాగానే ఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు అండగా నిలవాలని అన్నారు. పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఎస్పీతో పాటు అధికారులు, సిబ్బంది మొక్కలు నాటారు. తొలుత డీఎస్పీ రెహమాన్ ఎస్పీకి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో సీఐ శివప్రసాద్, ఎస్సైలు పురుషోత్తం, విజయకుమారి పాల్గొన్నారు.

పెద్దమ్మతల్లి ఆలయంలో రేపు చండీహోమం