
ఐదు గిరిజన కుటుంబాల వెలి..
● వారికి ఎవరూ సాయం చేయొద్దంటూ కట్టుబాటు ● జిల్లాలోని పాత పూసపల్లిలో అనాగరిక చర్య ● ఏడాదిగా ఇబ్బంది పడుతున్న బాధితులు
ఇల్లెందు : ప్రపంచం అన్ని రంగాల్లో పరుగులు తీస్తున్న ఈ కాలంలోనూ అనాగరికం రాజ్యమేలుతోందనడానికి ఈ ఘటన నిదర్శనం. భూపంచాయితీలో తమ మాట వినలేదంటూ ఐదు గిరిజన కుటుంబాలను వెలివేయడంతో పాటు వారికి ఎవరూ సాయం చేయొద్దంటూ నిబంధన విధించారు గ్రామ పెద్దలు. ఏడాది కాలంగా ఇబ్బంది పడుతున్న బాధితులు సీపీఎం నాయకుల సహకారంతో మంగళవారం తమ గోడును బాహ్య ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు. ఇల్లెందు మండలం పాతపూసపల్లి గ్రామానికి చెందిన గిరిజనులు ముడిగె రాములు, ముడిగె సీతమ్మ, ముడిగె సుగుణ, ముడిగె లక్ష్మీనారాయణ, ముడిగె సత్యనారాయణకు అదే కులానికి చెందిన కుంజా రాంబాబు కుటుంబంతో భూ వివాదం ఏర్పడింది. ఈ క్రమంలో గ్రామంలో పంచాయితీ పెట్టించగా స్థానిక పెద్దలు వర్సా అవినాష్, సూర్నబాక వెంకటనారాయణతో పాటు మరో 15 మంది కుల పెద్దలు రాంబాబు కుటుంబానికి అనుకూలంగా ఏకపక్ష తీర్పు చెప్పారని బాధితులు తెలిపారు. ఈ తీర్పును తాము వ్యతిరేకించడంతో ముడిగె కుటుంబాలకు చెందిన తమను గ్రామం, కులం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారని పేర్కొన్నారు. దీంతో ఏడాది కాలంగా తమను గ్రామంలో ఏ పనికీ పిలవడం లేదని, నెల క్రితం తమ కుటుంబంలో ఓ మహిళ మృతి చెందితే కడసారి చూపునకు కూడా ఎవరూ రాలేదని వాపోయారు. దహన సంస్కారాల్లో సహకరించేందుకు పక్కనున్న మిట్టపల్లి గ్రామం నుంచి కొందరు వస్తే వారిపైనా ఆగ్రహం వ్యక్తం చేశారని, గ్రామంలో ఉపాధి హామీ పనులకు కూడా తమకు అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఫీల్డ్ అసిస్టెంట్ తమ ఐదు కుటుంబాలతో గ్రూప్ ఏర్పాటుచేసి పని కల్పించారని చెప్పారు. తమ కుటుంబంలోని ఓ చిన్నారిని పాఠశాలకు వెళ్లేందుకు ఆటో కూడా ఎక్కించుకోకుంటే తల్లిదండ్రులే ప్రతి రోజూ తీసుకెళ్తున్నారని, మహిళలకు డ్వాక్రా రుణాలు కూడా ఇవ్వడం లేదని వెల్లడించారు.
బూర్జువా పాలన సాగుతోంది..
పాతపూసపల్లి గ్రామంలో బూర్జువా పాలన సాగుతోందని సీపీఎం, గిరిజన సంఘం నాయకులు వజ్జా సురేష్, కొడెం బోసు, మన్నెం మోహన్‌రావు అన్నారు. ఏడాది కాలంగా ఐదు కుటుంబాలను హింసించడం దుర్మార్గమని, ఇప్పటికై నా పోలీసులు, రెవెన్యూ అధికారులు స్పందించి వారికి న్యాయం చేయాలని కోరారు. కాగా, ఈ విషయమై బాధితులు ఎస్సై హసీనాను కలవగా, ఆమె పిలిపించి మాట్లాడినా గ్రామ పెద్దలు వినలేదని సమాచారం.