
‘నవోదయానికి’ తొలి అడుగు
అశ్వాపురం: మండలంలో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాలన్న ఈ ప్రాంత ప్రజల కల నెరవేరనుంది. నవోదయ ఏర్పాటుకు తొలి అడుగు పడింది. ఈ మేరకు మండల పరిధిలోని బీజీ కొత్తూరులో 30 ఎకరాల ప్రభుత్వ భూమి పత్రాలను తహసీల్దార్ మణిధర్ నవోదయ విద్యాలయ అధికారులకు మంగళవారం అప్పగించారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాకు నవోదయ విద్యాలయం రాగా, బీజీ కొత్తూరులో ప్రభుత్వ భూమిని గుర్తించడంతో పాటు రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇక్కడ తిరిగి నవోదయ విద్యాలయం ఏర్పాటు చేస్తారా, ఇతర ప్రాంతాలకు తరలిస్తారా అని ప్రజల్లో సందేహాలు మొదలయ్యాయి. కాగా, ఎట్టకేలకు భూమి కేటాయింపుతో స్థానికుల కల సాకారం కానుంది.