
మళ్లీ మొదటికొచ్చిన నిర్వాసితుడి సమస్య
● ఎమ్మెల్యే చొరవతో గత ఏడాది భూకేటాయింపు.. ● సాగును అడ్డుకున్న సింగరేణి అధికారులు
ఇల్లెందు: సింగరేణి నిర్వాసితుడు, ఇల్లెందుకు చెందిన సుందర్‌లాల్ లోథ్ భూ సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఏడేళ్ల పాటు ఆయన పోరాడగా గత ఏడాది ఆగస్టులో ఎమ్మెల్యే కోరం కనకయ్య హామీ తో భూమి కేటాయించారు. అయితే, సదరు భూమి లో సాగు పనులను సింగరేణి అధికారులు అడ్డుకోవడంతో మళ్లీ సమస్య మొదలైంది. తాతముత్తాల నుంచి సంక్రమించిన భూమిలో సింగరేణి ఓసీ ఏర్పాటు చేసినా తనకు పరిహారం చెల్లించకపోగా, పని కూడా కల్పించలేదని ఇల్లెందుకు చెందిన సుందర్‌లాల్ ఏళ్ల తరబడి నిరసన తెలిపారు. ఎడ్లబండిపై ఇసుక తీసుకొచ్చి అమ్ముతూ జీవనం సాగించే ఆయన అదే బండికి బ్యానర్లు కట్టి నిరసన కొనసాగించాడు. మూడేళ్ల క్రితం ఎడ్లబండితో ప్రగతిభవన్‌కు బయల్దేరగా పోలీసులు అడ్డుకోవడంతో బస్సులో వెళ్లి తన ఆవేదన వివరించారు. ఆపై ఓసారి సెల్ టవర్ ఎక్కడం, మరో మారు సుందర్‌లాల్ కుమారుడు సంజయ్ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. ఆపై 2022 డిసెంబర్‌లో జీఎం కార్యాలయం వద్ద ఎడ్లబండిని నిలిపి ఎద్దులతో మూత్రం పోయించాడని కేసు పెట్టడంతో జరిమానా విధించారు. చివరకు గత ఏడాది ఆగస్టులో సంజయ్ దేశంలో జీవించే అవకాశం లేదంటూ నేపాల్‌కు పయనమై మార్గమధ్యలో చిత్రీకరించిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో ఎమ్మెల్యే కనకయ్య ఆయనతో ఫోన్‌లో మా ట్లాడి వెనక్కి రప్పించారు. ఆపై ఇల్లెందు – కారేపల్లి బైపాస్ రోడ్‌లో సోలార్ ప్లాంట్ ఎదుట ఆరు ఎకరా ల భూమి చూపించగా అందులో సాగుపనులు మొ దలుపెట్టాడు. కానీ సింగరేణి అధికారులు అక్కడ సాగు చేయొద్దని అడ్డుకోవడంతో చేసేదేం లేక సోమవారం ఇల్లెందులోని ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఏళ్లనాటి తమ సమస్యకు శాశ్వ త పరిష్కారం చూపించాలని కోరాడు.