
రామాలయంలో తొలి ఏకాదశి సందడి
భద్రాచలం: తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆదివారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సందడి నెలకొంది. అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయం గోదావరి నదిలో పుణ్య స్నానాలను ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. తీర్థప్రసాదాలను స్వీకరించారు. దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులకు అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీ సేవగా చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత అర్చకులు స్వామివార్లకు విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణం ఘనంగా జరిపారు. కాగా, ఈ నెల 10న ఆషాఢ పూర్ణిమ సందర్భంగా గిరిజన ఉత్సవం దమ్మక్క సేవాయాత్రను వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ ఎల్.రమాదేవి తెలిపారు.