అందరికీ తెలిసేలా..
గిరిజన సంస్కృతి
భద్రాచలం: భద్రాచలం ఐటీడీఏ పీఓగా రాహుల్ బాధ్యతలు స్వీకరించి బుధవారంతో ఏడాది పూర్తయింది. విద్య, వైద్య రంగాలకు ప్రాముఖ్యత ఇస్తూనే గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు అందరికీ తెలిసేలా ఆయన చేపట్టిన చర్యలు విజయవంతం అయ్యాయి. రాహుల్ ప్రత్యేక చొరవతో రూపుదిద్దిన గిరిజన మ్యూజియం పర్యాటక ప్రాంతంగా మారింది.
చదువును చక్కదిద్దుతూ..
ఏజెన్సీలో విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, గిరిజనాభివృద్ధికి కృషి చేస్తానని విధుల్లో చేరిన రోజే చెప్పారు. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పర్యటించి కొందరు విద్యార్థులు కనీస సామర్థ్యాల్లో వెనుకబడ్డారని గుర్తించారు. అలాంటి వారి కోసం ‘ఉద్దీపనం’ పేరిట 1 నుంచి 4వ తరగతుల వరకు గణితం, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో స్టడీ మెటీరియల్ రూపొందించారు. పదో తరగతి పూర్తయిన విద్యార్థుల కోసం ‘కెరీర్ గైడెన్స్ వాల్’ను ఏర్పాటు చేయించారు.
నిరుద్యోగులకు ప్రోత్సాహం..
నిరుద్యోగ యువత, గిరిజన మహిళల స్వయం ఉపాధికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. మిల్లెట్స్‌తో బిస్కెట్లు, సబ్బులు, షాంపూల తయారీ వంటి చిన్న తరహా పరిశ్రమల్లో వారిని భాగస్వాములను చేశారు. మార్కెటింగ్‌కు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. జాబ్‌మేళాలు నిర్వహించి ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగాలు ఇప్పించారు. నిరుద్యోగులు చదువుకుని ఉద్యోగాలు సాధించేలా భద్రాచలంలోని లైబ్రరీని పంచాయతీ నిధులతో అభివృద్ధి చేయడంతో పాటు స్టడీ మెటీరియల్ ఏర్పాటు చేశారు. మెరిట్ ర్యాంకర్లకు ల్యాప్‌టాప్‌లు, ఆర్థిక సాయం అందిస్తున్నారు.
ఆదివాసీల వంటకాలు అందరికీ తెలిసేలా..
ఐటీడీఏ ప్రాంగణంలో గిరిజన మ్యూజియాన్ని ఆధునికీకరించడంతో పాటు ఆదివాసీ వంటకాల రుచులు అందరికీ తెలిసేలా స్టాళ్లు ఏర్పాటు చేసి మంత్రులు, ఉన్నతాధికారుల మెప్పు పొందారు. ఆదివాసీ ఉత్పత్తులను విశ్వవ్యాప్తం చేసేందుకు ఢిల్లీ భవన్‌లో సైతం ప్రదర్శనకు ఉంచారు. అంతేకాక ఆదివాసీ భాష తాను నేర్చుకుంటూ వారితో మమేకమయ్యేలా ప్రయత్నించారు. ప్రత్యేక కార్యక్రమాలకు కోయ భాషలో ఆహ్వానాలు అందిస్తూ గిరిజన సంస్కృతిని విశ్యవ్యాప్తం చేస్తున్నారు.
మెరుగైన వైద్య సేవలందేలా..
గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రణా ళికలు రూపొందించారు. గోదావరి వరదల సమయంలో గర్భిణులను గుర్తించి ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ధరల పట్టిక రూపొందించి అధికంగా వసూలు చేయకుండా కట్టడి చేశారు. అయితే మూడు రాష్ట్రాల గిరిజనులకు కేంద్రంగా ఉన్న భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిపై మాత్రం తనదైన మార్క్ చూపించలేకపోయారనే ఆరోపణలు ఉన్నాయి.
ఆదివాసీ భాష, కట్టుబాట్లను పదిలపరుస్తున్న పీఓ
స్వయం ఉపాధి, విద్యారంగంపై ప్రత్యేక దృష్టి
రాహుల్ బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది


