ఇంకెన్నాళ్లకు ‘లిఫ్ట్’ ఇస్తారు?
● నత్తనడకన ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ పనులు ● 208–19లో మూడు పథకాలకు రూ.29.64 కోట్లు మంజూరు ● ఇంకా పూర్తికాని నాగారం, సూరారం లిఫ్ట్‌ల పనులు ● సాగునీటి కోసం ఎదురుచూస్తున్న ఆయకట్టు రైతులు
పాల్వంచరూరల్: ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ పనులు చేపట్టి ఐదేళ్లు గడిచినా పూర్తికాలేదు. పనుల జాప్యంతో సాగునీరు అందక పంటలు సాగు కావడం లేదు. దీంతో ఆయకట్టు రైతులు మనోవేదన చెందుతున్నారు. మూతపడ్డ ఎత్తిపోతల పథకాల(లిఫ్ట్)ల పునరుద్ధరణకు గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. జిల్లాలో మొత్తం 111 ఎత్తిపోతల పథకాలు ఉండగా, 21 పనిచేయడంలేదు. మరో ఐదు మూతపడ్డాయి. కొన్ని పథకాలు పనిచేస్తున్నాయి. 2018–19 సంవత్సరంలో జిల్లాలో మూడు లిఫ్ట్‌లకు రూ. 29.64 కోట్లు మంజూరు చేసింది. ఇందులో చర్ల మండలం పెదమిడిసిలేరు వద్ద లిఫ్ట్‌ను రూ.9.31 కోట్లతో పునరుద్ధరణ చేపట్టారు. పాల్వంచ మండలం నాగారం ఎత్తిపోతల పథకానికి రూ.14 కోట్లు, సూరారం ఎత్తిపోతల పథకానికి రూ.6.33 కోట్లు మంజూరు చేశారు. కానీ పనులు ఇప్పటివరకు పూర్తికాలేదు.
నాగారంలో అసంపూర్తిగా..
పాల్వంచ మండలం జగన్నాథపురం సమీపంలో కిన్నెరసాని వాగుపై రూ. 30 లక్షలతో 1978లో నాగారం లిఫ్ట్ నిర్మించారు. జగన్నాథపురం, రంగాపురం, నాగారం, సంగం, నారాయణరావుపేట గ్రామాల పరిధిలో 1,808 ఎకరాలకు సాగునీరు అందించారు. కిన్నెరసాని వాగులో బూడిద మేట వేయడంతో లిఫ్ట్ మరమ్మతులకు గురైంది. పలుమార్లు మరమ్మతులు నిర్వహించి సాగునీరు అందించారు. 1981లో పథకం పూర్తిగా నడపలేని పరిస్థితి తలెత్తడంతో మూతపడింది. ఆయకట్టు రైతుల విన్నపంతో రూ.18 లక్షలతో మరమ్మతులు చేపట్టినా రైతులకు ఉపయోగపడలేదు. ఆ తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. 2019లో ప్రభుత్వం లిఫ్ట్‌ల పునరుద్ధరణకు రూ. 14 కోట్లు మంజూరు చేయగా, పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ కిన్నెరసాని వాగు ఒడ్డున పాత లిఫ్ట్ సమీపంలో ఓ బావిని తవ్వి అసంపూర్తిగా వదిలేశారు. పైపులైన్ కోసం కాల్వ నిర్మించి వదిలేశారు. ప్రస్తుతం ఆ కాల్వలు కూడా పూడుకుపోయాయి. కొంత దూరం పైపులైన్ వేశారు. లిఫ్ట్ కోసం తెచ్చిన పైపులు బీసీఎం ప్రధాన రహదారి పక్కన పడవేశారు. అటవీశాఖ అభ్యంతరాలతో పనులు నిలిచిపోయాయి. పిల్ల కాల్వలు నిర్మించాల్సి ఉంది.
సూరారంలో పైపులైన్ నిర్మించలే..
సూరారం గ్రామ సమీపంలోని మూతపడ్డ లిఫ్ట్ పునరుద్ధరణ పనుల్లో కూడా తీవ్ర జాప్యం చేస్తున్నారు. 1986లో లిఫ్ట్ నిర్మాణం చేపట్టారు. సూరారం, బిక్కుతండా, కమ్మరిగూడెం, సోములగూడెం గ్రామాల పరిధిలో 970 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందింది. కిన్నెరసాని వాగు ఒడ్డున కట్టిన లిఫ్ట్‌తో పలువురు రైతులు లబ్ధిపొందారు. కానీ బూడిదనీరు కిన్నెరసాని వాగులో ప్రవహించడంతో లిఫ్ట్ పనిచేయకుండా పోయింది. 2019లో పునరుద్ధరణ కోసం రూ.6.33 కోట్లు మంజూరు చేశారు. టెండర్ల ద్వారా పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ ప్రధాన పైపులైన్ పనులు మాత్రం పూర్తిచేశారు. ఇంకా 9 కిలోమీటర్ల మేర పైపులైన్ కాల్వ నిర్మించాల్సి ఉంది. పంపుహౌస్, మైనర్ పనులు నిర్వహించాల్సి ఉన్నా చేపట్టడంలేదు. ఇక నాగారం లిఫ్ట్ కింద 14 కిలోమీటర్ల మేర కాల్వ నిర్మించాల్సి ఉంది.
నత్తనడకన సాగుతున్నాయి...
నాగారం లిఫ్ట్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈఏడాది పూర్తయ్యే పరిస్థితి కన్పించడంలేదు. పైపులైన్ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేసి సాగునీరు అందించాలి. పనులు పూర్తయితే రెండు పంటలకు సాగునీరు అందుతుంది.
–బాదర్ల నాగేశ్వరరావు, జగన్నాథపురం, రైతు
త్వరితగతిన పూర్తి చేయాలి
సూరారం లిఫ్ట్ పునరుద్ధరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. పంపుహౌస్, మైనర్ కాల్వల పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులు కూడా పూర్తి చేసి భూములకు సాగునీరు అందించాలి. లిఫ్ట్ కింద మాకు రెండెకరాలు ఉంది. నీళ్లు లేకపోవడంతో పంటలు పండటం లేదు. –పి. సందీప్, సూరారం
పనులు కొనసాగుతున్నాయి
సూరారం, నాగారం లిఫ్ట్ నిర్మాణ పనులు గతేడాదే పూర్తికావాల్సి ఉంది. పనుల్లో జాప్యంపై సంబంధిత కాంట్రాక్టర్‌కు రెండు సార్లు నోటీసులు జారీ చేశాం. అయినా స్పందించకపోవడంతో మరో కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాం.
– బి.అర్జున్, జలవనరులశాఖ ఈఈ
ఇంకెన్నాళ్లకు ‘లిఫ్ట్’ ఇస్తారు?
ఇంకెన్నాళ్లకు ‘లిఫ్ట్’ ఇస్తారు?
ఇంకెన్నాళ్లకు ‘లిఫ్ట్’ ఇస్తారు?
ఇంకెన్నాళ్లకు ‘లిఫ్ట్’ ఇస్తారు?


