
బాలుడి గొంతులో ప్లాస్టిక్ గన్ బుల్లెట్
● ఏడాదిగా నొప్పి, మింగలేక ఇబ్బందులు ● శస్త్రచికిత్స ద్వారా బయటకు తీసిన వైద్యుడు
ఖమ్మంవైద్యవిభాగం: ఆడుకునే క్రమాన ప్లాస్టిక్ గన్ బుల్లెట్‌ను నోట్లో పెట్టుకోగా అది బాలుడి గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఏడాది కాలంగా నొప్పి, ఏదీ సరిగా తినలేక ఇబ్బంది పడుతుండగా శస్త్రచికిత్స ద్వారా బయటకు తీసిన వైనమిది. మహబూబాబాద్ జిల్లా పాతపోచారం గ్రామానికి చెందిన పి.శ్రవణ్‌కుమార్ – సౌజన్య దంపతుల మూడేళ్ల కుమారుడు షణ్ముక్ కొంత కాలంగా గొంతు నొప్పి, మింగలేకపోవడం, తినలేక బాధపడుతున్నాడు. చాలా ఆస్పత్రులకు వెళ్లినా ఫలితం లేక ఖమ్మం నెహ్రూనగర్‌లోని ప్రవీణ్ ఈఎన్‌టీ ఆస్పత్రిలో డాక్టర్ ఎం.జీ.వీ.ప్రవీణ్‌ను సంప్రదించారు. బాలుడికి ఎండోస్కోపీ నిర్వహించినా ఫలితం లేక సిటీ స్కాన్ చేయగా గొంతు వెనుక భాగంలో వస్తువు కనిపించింది. అత్యంత సున్నితమైన మెదడు అడుగు భాగాన పదునైన వస్తువు ఉన్నట్లు తేలడంతో శస్త్రచికిత్స ద్వారా బయటకు తీయగా అది ప్లాస్టిక్ గన్ బుల్లెట్‌గా గుర్తించారు. దీన్ని అలానే వదిలేసి ఉంటే కపాలం నుంచి మెదడులోకి చొచ్చుకెళ్లి మెదడుకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలను పాడు చేసేదని వైద్యుడు తెలిపారు.

బాలుడి గొంతులో ప్లాస్టిక్ గన్ బుల్లెట్