ముగ్గురు వేటగాళ్ల అరెస్ట్
ములకలపల్లి: వన్యప్రాణులను హతమారుస్తున్న ముగ్గురు వేటగాళ్లను అటవీశాఖ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎం. రవికిరణ్ కథనం ప్రకారం.. ఏపీలోని వేలేరుపాడు మండలం కుమ్మరిగూడెం గ్రామానికి చెందిన కుంజా విష్ణు తన నాటుతుపాకీతో అశ్వారావుపేట మండలం నందిపాడుకు చెందిన కుర్సం రామకృష్ణతో కలిసి శుక్రవారం రాత్రి మండలంలోని కుమ్మరిపాడు గ్రామానికి వచ్చారు. అదే గ్రామానికి చెందిన పద్దం సీతారాములు, పద్దం వినోద్‌లతో కలిసి గ్రామ శివారులోని అటవీప్రాంతానికి వన్యప్రాణుల వేటకు వెళ్లారు. శనివారం ఉదయం తిరిగి ఇంటికి వస్తుండగా పక్కా సమాచారంతో ఫారెస్ట్ అధికారులు గస్తీ ఏర్పాటు చేశారు, చాపరాలపల్లి వెస్ట్‌బీట్, కంపార్ట్‌మెంట్ నెంబర్ 24 వద్ద అటవీశాఖ సిబ్బందికి వేటగాళ్లు ఎదురుపడినా తప్పించుకున్నారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి విష్ణు, రామకృష్ణ, సీతారాములను మంగళవారం అదుపులోకి తీసుకొని, అరెస్ట్ చేశారు. కుంజా వినోద్ పరారీలో ఉన్నాడు. నిందితులను బుధవారం కొత్తగూడెం కోర్టులో హాజరుపర్చగా, జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు.
నాటు తుపాకీ స్వాధీనం


