
జాతీయవాదాన్ని వ్యతిరేకించడం దేశద్రోహమే..
ఖమ్మంవన్‌టౌన్: జాతీయవాదాన్ని వ్యతిరేకించడం దేశద్రోహమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇటీవల నగరంలో జాతీయవాదుల నేతృత్వాన నిర్వహించిన తిరంగా యాత్రను కొంతమంది అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఘటనపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. గురువారం ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు నేతృత్వాన జిల్లా నేతలు కరీంనగర్‌లోని బండి సంజయ్ క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించగా.. ఆయన స్పందించారు.ఇలాంటి దేశద్రోహకర చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని, దేశద్రోహం కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను కోరారు. బండి సంజయ్‌ను కలిసిన వారిలో పార్టీ రాష్ట్ర నాయకులు సన్నే ఉదయప్రతాప్, రమేష్, నున్నా రవికుమార్, నంబూరి రామలింగేశ్వరరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.