
పురుగుల మందు తాగి కారు డ్రైవర్ ఆత్మహత్య
అశ్వారావుపేటరూరల్: పురుగుల మందు తాగి ఓ కారు డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక ఎస్సై యయాతి రాజు కథనం ప్రకారం.. పట్టణంలోని దండాబత్తుల వారి వీధికి చెందిన వరికూటి వెంకన్నబాబు(37) కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గడిచిన కొద్ది రోజులుగా ఖాళీగా ఉండడంతో కుటుంబపోషణ భారంగా మారడంతో మనస్తాపానికి గురై గురువారం తెల్ల వారుజామున ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి కొత్తగూడెంకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం కలరు. కాగా, మృతుడి అన్నయ్య సత్యనారాయణ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
టేకులపల్లిలో ఏసీబీ దాడులు?
టేకులపల్లి: టేకులపల్లి మండలంలో ఏసీబీ అధికారులు మండలానికి చెందిన అధికారిని పట్టుకునేందుకు రెండు సార్లు ప్రయత్నం చేసినట్లు తెలిసింది. మండలంలో పని చేస్తున్న మండల అధికారిపై అవినీతి ఆరోపణలు, ఫిర్యాదు రావడంతో ఏసీబీ అధికారులు గత వారంలో ఒక రోజు, ఈ వారంలో ఒకసారి ఆ అధికారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు ప్రయత్నించగా ముందే పసిగట్టిన తప్పించుకున్నట్లు సమాచారం. అంతగా మండలంలో అవినీతికి పాల్పడుతున్న మండల అధికారి ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు శాఖలకు చెందిన అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యాన తాజాగా టేకులపల్లి ఉదంతం వెలుగులోకి రావడంతో మండలంలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
రోడ్డు ప్రమాదంలో
ఇరువురికి తీవ్ర గాయాలు
ఇల్లెందురూరల్: మండలంలోని సుభాష్‌నగర్ గ్రామపంచాయతీ రేణుక ఎల్లమ్మ ఆలయం సమీపాన గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కారేపల్లి మండలం బస్వాపురం గ్రామానికి చెందిన బానోత్ లాల్‌సింగ్, ఇల్లెందు మండలం జింకలతండా గ్రామానికి చెందిన బానోత్ సుప్రజ ఇరువురు బైక్‌పై కొత్తగూడెం నుంచి ఇల్లెందుకు వస్తున్నారు. ఈక్రమంలో ఎదురుగా కారు ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వైద్యులు ఖమ్మంకు సిఫారసు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.