
రామయ్య సేవలో మాజీ స్పీకర్
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానాన్ని మాజీ స్పీకర్, బీఆర్‌ఎస్ నేత మధుసూదనాచారి గురువారం సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే బీఆర్‌ఎస్ నేత ఎనుగుల రాకేష్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. డివిజన్ నాయకులు మానె రామకృష్ణ, మండల కన్వీనర్ సునీల్ పాల్గొన్నారు.
ట్రాలీ ఆటో డ్రైవర్‌పై
కేసు నమోదు
పాల్వంచరూరల్: ట్రాలీ ఆటో డ్రైవర్ నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా ముగ్గురికి తీవ్రగాయాలైన ఘటనలో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. పోలీసులు కథనం ప్రకారం.. ఈ నెల 19న రాత్రి మండల పరిధి లక్ష్మీదేవిపల్లి బీసీఎం జాతీయ ప్రధాన రహదారి పక్కన మెకానిక్ షాపువద్ద ద్విచక్ర వాహనానికి మరమ్మతులు చేస్తున్న ఆసీఫ్, దంతలబోరు గ్రామానికి చెందిన పోలేబోయిన రాజారావు, చెరుకు శ్రీనులను పాల్వంచ వైపు వస్తున్న ట్రాలీ ఆటో ఢీకొంది. దీంతో ముగ్గురికి తీవ్రగాయలు కాగా ఖమ్మంకు తరలించారు. పోలేబోయిన వీర్రాజు ఫిర్యాదు మేరకు ఏపీ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా లింగపాలెం గ్రామానికి చెందిన డ్రైవర్ కంచర్ల కృష్ణయ్యపై గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.
పందెంరాయుళ్లపై..
దమ్మపేట: కోడి పందేలు నిర్వహిస్తున్న పందెంరాయుళ్లపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని దిబ్బగూడెం గ్రామ శివారులో కోడి పందేలు నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై సాయికిషోర్‌రెడ్డి, తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. దీంతో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రెండు కోడి పుంజులు, రూ.2,200 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.