
వినతుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
గ్రీవెన్స్ డేలో కలెక్టర్ జితేష్ వి.పాటిల్
కొత్తగూడెంఅర్బన్: ప్రతీ సోమవారం ప్రజావాణి(గీవెన్స్ డే)లో అందే ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారంపై దృష్టి సారించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆయన ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమై పరిశీలన, పరిష్కారంపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ విద్యాచందన, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని...
● చండ్రుగొండ మండలం తిప్పనపల్లికి నివసిస్తున్న తోట భార్గవి తల్లి నుండి సంక్రమించిన భూమి సాగును సోదరులు అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేసింది.
● పినపాక మండలం కరకగూడెం జీపీ పరిధిలోని చోప్పాలా, నర్సాపురం గ్రామస్తులు రోడ్డు సౌకర్యం కోసం విన్నవించారు.
● అశ్వాపురం మండలం మొండికుంటకు చెందిన నోముల లక్ష్మి 2024 వరదల్లో ఇల్లు కొట్టుకుపోయినందున ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు.
● లక్ష్మీదేవిపల్లి మండలం బోరింగ్ తండాకు నూనావత్ జగన్‌మోహన్‌దాస్ రోడ్డు విస్తరణలో తాను కిరాణా షాప్‌ను కోల్పోయినందున న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు.
● బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజరకు చెందిన జివాజి రమాదేవి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు.
● ములకలపల్లి మండలంలో జరుగుతున్న సీతారామ ప్యాకేజ్–3 పనులకు సంబంధించి విలువైన రాళ్లను గుర్తుతెలియని వ్యక్తులు అక్రమంగా తరలిస్తున్నందున చర్యలు తీసుకోవాలని కొత్తూరు గ్రామానికి చెందిన ఆంగోతు సుధాకర్ ఫిర్యాదు చేశారు.
పూడికతీత పనులకు రూ.167.7 లక్షలు
కొత్తగూడెంఅర్బన్: సింగరేణి మణుగూరు ఏరియా ఆధ్వర్యాన చెరువుల పూడికతీతకు గాను రూ.167.7లక్షలు కేటాయించారు. ఈ నిధులతో మణుగూరులోని కోడిపుంజుల వాగు, సమితి సింగారం చెరువు, పొడ పొట్రాల చెరువు, ఎర్ర లక్ష్మయ్య కుంట పూడికతీత పనులు చేపడుతారు. తద్వారా వర్షాకాలం ఎక్కువ నీటి నిల్వకు అవకాశం ఏర్పడుతుందని, సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని అధికారులు తెలిపారు. ఈమేరకు నిధుల కేటాయింపు పత్రాలను కలెక్టర్ పాటిల్‌కు సోమవారం సింగరేణి అధికారులు అందజేశారు. సీపీఓ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.