
అనారోగ్యంతో టీచర్ మృతి
ఇల్లెందు: పట్టణంలోని మొహల్లా నెంబర్–16 ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ఎస్‌జీటీ ఉపాధ్యాయుడు బి. నగేష్(45) అనారోగ్యంతో శనివారం మృతి చెందాడు. మృతుడికి భార్య రాధ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. టేకులపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామానికి చెందిన నగేష్ ఐదేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. మృతి పట్ల టీఎస్ యూటీఎఫ్, ఏటీఎఫ్, టీపీటీఎస్, పీఆర్‌టీయూ సంఘాల నాయకులు రాంబాబు, వెంకటేశ్వర్లు, కబ్బాకుల రవి, మోకాళ్ల శ్రీనివాస్, వెంకట్రాం, సర్వేశ్వరరావు తదితరులు నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
చికిత్స పొందుతున్న ఆటోడ్రైవర్..
పాల్వంచరూరల్: పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని సీతానగర్ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ గుగులోత్ సాయిమహేందర్‌నాయక్(33) గత నెల 21న ఇంటి వద్ద పురుగుల మందుతాగాడు. అపస్మారక స్థితిలో పడి ఉండగా, కుటుంబ సభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. అనంతరం ఈ నెల 14న భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి భార్య నీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు..
● మరొకరికి తీవ్ర గాయాలు
ఇల్లెందురూరల్: మండలంలోని కొమ్ముగూడెం గ్రామపంచాయతీ అశోక్‌నగర్ సమీపంలో శనివా రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. మా మిడిగుండాల గ్రామపంచాయతీ మేడికుంట గ్రామానికి చెందిన తెల్లం రామ్మూర్తి (35), చింత రవి భవన నిర్మాణ పనులు చేసేందుకు బైక్‌పై మసివాగు వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో అశోక్‌నగర్ మూలమలుపు వద్ద బైక్‌ను చెట్టును ఢీకొనడంతో తీవ్ర గాయాలై రామ్మూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు. చింత రవికి కూడా తీవ్రంగా గాయాలు కావడంతో 108 వాహనంలో ఇల్లెందు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం సిఫారసు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. మృతుడు రామ్మూర్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
విద్యుదాఘాతంతో ఐదు పశువులు మృతి
జూలూరుపాడు: విద్యుదాఘాతంతో ఐదు పశువులు మృత్యవాత పడ్డాయి. రెండు రోజుల క్రితం ఈదురు గాలులతో కూడిన వర్షానికి మండలంలోని సురారం గ్రామంలో విద్యుత్ స్తంభం విరిగిపడింది. శనివారం ఉదయం మేతకు వెళ్లిన రెండు దుక్కిటెద్దులు, మూడు పాడి పశువులు తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాయి. సుమారు రూ. 3 లక్షల నష్టం వాటిల్లిందని బాధిత, సురారానికి చెందిన రైతులు బానోత్ వెంకటేశ్వర్లు, ఉడుతల వెంకన్న, తేజావత్ సూర్య, మందెరకల నాగేశ్వరరావు, జూలూరి లక్ష్మి వాపోయారు. ప్రభుత్వం నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. విద్యుత్ ఏఈ సతీష్, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తామని ఏఈ తెలిపారు. అనంతరం జూలూరుపాడు పశువైద్యాధికారి సాయిరాం సందీప్ మృత్యువాతకు గురైన పశువులకు పోస్ట్‌మార్టం నిర్వహించారు.

అనారోగ్యంతో టీచర్ మృతి

అనారోగ్యంతో టీచర్ మృతి