
నేటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ఉపాధ్యాయులకు ఈ నెల 13 నుంచి 30 తేదీ వరకు మూడు విడతలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి తెలిపారు. సోమవారం శిక్షణ కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. జిల్లాలోని 4,159 మంది ఉపాధ్యాయులకు విడతకు ఐదు రోజుల చొప్పున జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన 48 మంది ఉపాధ్యాయులతో ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. శిక్షణకు వచ్చే ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజన వసతి కూడా కల్పించామని, అందరూ ఉదయం 9:30 గంటలలోపే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ ద్వారా హాజరు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ జిల్లా కో–ఆర్డినేటర్లు పాల్గొన్నారు.
సింగరేణి క్రికెట్ టోర్నీ విజేత బెల్లంపల్లి
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెంలోని జయశంకర్ గ్రౌండ్‌లో మూడు రోజులపాటు జరిగిన సింగరేణి ఎగ్జిక్యూటివ్ క్రికెట్ టోర్నీలో బెల్లంపల్లి రీజియన్ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కొత్తగూడెం జట్టుపై విజయం సాధించింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ (ఈ అండ్ ఎం) సత్యనారాయణ రావు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. మహిళా విభాగంలో కొత్తగూడెం జట్టు విజేతగా నిలవగా, బెల్లంపల్లి టీమ్ రన్నర్‌గా నిలిచింది. ఈ కార్యక్రమంలో జీఎంలు ఎం.శాలేంరాజు, మనోహర్‌తోపాటు కోటిరెడ్డి, పాలడుగు శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్ గడువు
పొడిగింపు
25 శాతం రాయితీతో
ఈనెల 31వరకు అవకాశం
ఖమ్మంమయూరిసెంటర్: ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు ఫీజు చెల్లించే గడువును ప్రభుత్వం ఈనెల 31వ తేదీ వరకు పొడిగించింది. ఫీజు చెల్లింపులో 25 శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం రెండు నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ గడువు ఈనెల 3తో ముగియగా.. మరోసారి పెంచుతూ ప్రభుత్వ కార్యదర్శి కె.ఇలంబర్తి పేరిట సోమవారం ప్రకటన విడుదలైంది. దీంతో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు 25శాతం రాయితీ పొందేందుకు మరో అవకాశం లభించింది. తద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీల నుండి ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పౌర రక్షణ వలంటీర్లుగా నమోదు చేసుకోవాలి
ఖమ్మం రాపర్తినగర్: భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన పౌర రక్షణ వలంటీర్లుగా నమోదుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నందున యువ త సద్వినియోగం చేసుకోవాలని నెహ్రూ యు వక కేంద్రం ఖమ్మం డిప్యూటీ డైరెక్టర్ సీహెచ్.అన్వేష్ సూచించారు. అత్యవసర పరిస్థితులు, సంక్షోభ సమయాల్లో కీలకపాత్ర పోషించే అవకాశమున్నందున యువత ముందుకు రావాలని సూచించారు. ప్రథమ చికిత్స, అత్యవసర సంరక్షణ, ట్రాఫిక్ నిర్వహణ, విపత్తు ప్రతిస్పందన, పునరావాస ప్రయత్నాల్లో తోడ్పాటులో యువతకు అవకాశం ఇవ్వున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వివరాల కోసం htpps// mybharat. gov. in లేదా 94913 83832 నంబర్‌లో సంప్రదించాలని డీడీ ఓ ప్రకటనలో సూచించారు.
రోడ్డు ప్రమాదంలో
ఒకరికి గాయాలు
ఇల్లెందురూరల్: మండలంలోని కొమరారం గ్రామ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుండాల మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన కల్తి సమ్మయ్య తీవ్రంగా గాయపడ్డాడు. గుండాల నుంచి బైక్‌పై ఇల్లెందుకు వస్తుండగా సమ్మయ్యను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. స్థానికులు గమనించి క్షతగాత్రుడిని ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఐదుగురిపై
కేసు నమోదు
కరకగూడెం: తంబోలా ఆడుతున్న ఐదుగురిపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. మండల కేంద్రంలో తంబోలా ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఐదుగురిని అదుపులోకి తీసుకోగా, మరికొందరు పరారయ్యారు. ఐదు సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనం, రూ.1500 నగదు స్వాధీనం చేసుకున్నారు. పరారైన వారిని కూడా పట్టుకుంటామని కరకగూడెం ఎస్‌ఐ నాగేశ్వరరావు తెలిపారు.