భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి నిత్య కల్యాణ వేడుక ఆదివారం నేత్ర పర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన, తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. నిత్యకల్యాణ వేడుకలోనూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు అమ్మవారికి విశేష పూజలు జరిపారు. భక్తులు అన్న ప్రాసనలు, ఒడి బియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి పాల్గొన్నారు.
నేడు ఎంపీ రఘురాంరెడ్డి పర్యటన
అశ్వారావుపేటరూరల్: ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురాంరెడ్డి స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి అశ్వారావుపేట మండలంలో సోమవారం పర్యటిస్తారని ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన వివరాలు వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలోని పేరాయిగూడెంలో పర్యటిస్తారని, అనంతరం కన్నాయిగూడెం పంచాయతీ చెన్నాపురం, అనంతరం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న శ్రీ గుబ్బలమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుంటారని వివరించారు. మండలంలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు హాజరు కావాలని కోరారు.
తేనీటి విందుకు హాజరైన మంత్రి సీతక్క
అశ్వాపురం: మండల కేంద్రానికి చెందిన, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గాదె కేశవరెడ్డి నివాసంలో రాష్ట్ర పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) ఆదివారం తేనీటి విందుకు హాజరయ్యారు. తమ నివాసానికి విచ్చేసిన మంత్రిని కేశవరెడ్డి కుటుంబ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు.
భద్రాచలంవాసికి కవిరత్న పురస్కారం
భద్రాచలంటౌన్: పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు, కవి తోటమళ్ల సురేష్ బాబుకు కవిరత్న జాతీయ పురస్కారం లభించింది. ఏపీలోని ఏలూరులో ఈ నెల 10 ,11 తేదీల్లో జరిగిన శ్రీశ్రీ కళావేదిక ప్రపంచ సాహితీ సంబరాల్లో సురేష్‌కు ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్, శ్రీశ్రీ కళావేదిక సీఈఓ కత్తిమండ ప్రతాప్‌లు ఆదివారం అవార్డు ప్రదానం చేశారు. జ్ఞాపికను అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు.
నేడు గిరిజన దర్బార్
భద్రాచలంటౌన్: ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్‌కు అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని పీఓ బి. రాహుల్ ఒక ప్రకటనలో సూచించారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే దర్బార్‌లో గిరిజనులు ఫిర్యాదులు అందజేయాలని పేర్కొన్నారు.

నేత్రపర్వంగా రామయ్య కల్యాణం