
సంపద పేదలకు పంచితే అన్యాయమా?
● రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు ● దొరల పాలన కోసం దోపిడీదారులు ఏకమవుతున్నారు.. ● డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
అశ్వారావుపేట : రాష్ట్రంలో సంపద సృష్టించి పేదలకు పంచడం అన్యాయమా అని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రశ్నించారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో రూ.40 కోట్లతో నిర్మించనున్న ఆరు విద్యుత్ సబ్‌స్టేషన్ పనులకు శనివారం స్థానిక పామాయిల్ ఫ్యాక్టరీ ఆవరణలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ‘దొరల పాలన కోసం దోపిడీదారులు ఏకమవుతున్నారు.. తస్మాత్ జాగ్రత్త..’ అంటూ హెచ్చరించారు. ప్రజల వద్ద డబ్బు లాగి దోపిడీ చేసేందుకు తాము అధికారంలోకి రాలేదని, రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వెల్లడించారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ ప్రజలను జలగల్లా పీల్చేసిందని, కేసీఆర్ అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో సభలు నిర్వహిస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. గడిచిన పదేళ్లలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇచ్చారా.. దళితులకు మూడెకరాల భూమిచ్చారా.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారా.. అని ప్రశ్నించారు. కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లు తెచ్చి గోదావరిలో పోశారని ఆరోపించారు. రూ.7లక్షల కోట్ల అప్పు తమ ప్రభుత్వం మీద పడేసినా, సంక్షేమ పథకాల అమలులో వెనుకడుగు వేయడం లేదన్నారు. గిరిజనుల వ్యవసాయం కోసం రూ.12,500 కోట్లతో ఇందిర జల వికాస్ పథకం ప్రవేశపెడుతున్నామని, ఈనెల 18న నాగర్‌కర్నూల్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని, అదే రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. ఈ పథకంలో గిరిజన రైతులకు సోలార్, డ్రిప్, ఉద్యాన మొక్కలు ఉచితంగా అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. పేదల కళ్లలో ఆనందం చూడటమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గం వెనుకబడి ఉందని, అందుకే విద్యుత్ సబ్ స్టేషన్ల ఏర్పాటుతో రైతుల కళ్లలో వెలుగులు చూడనున్నామని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ప్రతి తండాకు, గ్రామానికీ నాణ్యమైన విద్యుత్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని, ఇప్పుడు మరింత మెరుగైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత ప్రభుత్వం కోళ్ల ఫారాల్లో, పాడుపడిన రైస్ మిల్లుల్లో గురుకులాలు నిర్వహిస్తే, తాము 25 ఎకరాలకుపైగా స్థలంలో ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు రూపకల్పన చేశామన్నారు. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, ఐటీడీఏ పరిఽధిలో కోటాకు మించి ఇస్తున్నామని ప్రకటించారు. సమాచార శాఖ ద్వారా గత ప్రభుత్వం అసత్య ప్రచారాలకు రూ.1,052 కోట్లు దుర్వినియోగం చేసిందన్నారు. కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కె.వరుణ్‌రెడ్డి, ఎమెల్యేలు జారే ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, రాందాస్ నాయక్, ఐడీసీ, గిడ్డంగుల సంస్థ చైర్మన్లు మువ్వా విజయ్‌బాబు, రాయల నాగేశ్వరరావు, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏ పీఓ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యుత్ కోసమే..
అశ్వారావుపేటరూరల్ : భవిష్యత్‌లో మరింత నాణ్యమైన విద్యుత్ సేవలు అందించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అందుకే అశ్వారావుపేట నియోజకవర్గానికి రూ.40 కోట్లతో ఆరు సబ్‌స్టేషన్లు మంజూరు చేశామని చెప్పారు. మారుమూల అటవీ ప్రాంతాల్లోని రైతులు, గిరిజనులకు నాణ్యమైన విద్యుత్ వెలుగులు అందించాలని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కోరా రని, దీంతో సబ్‌స్టేషన్లు మంజూరు చేశామని వెల్లడించారు. అశ్వారావుపేట మండలం ఆసుపాకలో రూ.24.46 కోట్లతో 400/220 కేవీ, కావడిగుండ్లలో రూ.2.24 కోట్లు, అచ్యుతాపురంలో రూ.3.10 కోట్లు, తిరుమలకుంటలో రూ.3.15 కోట్లు, అశ్వారావుపేట–2 కింద రూ.2.53 కోట్లు, దమ్మపేట మండలం పార్కలగండిలో రూ.2.24 కోట్లతో 33/11కేవీ సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నట్లు వివరించారు. ఈ పనులు పూర్తయితే ఆయా గ్రామాల్లోని గృహ వినియోగదారులు, వ్యవసాయ కనెక్షన్లకు లో ఓల్టేజీ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం మారి 16 నెలలు గడుస్తున్నా.. ప్రజా సంక్షేమంపై ప్రభుత్వ లక్ష్యం అధికారులకు అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లే క్రమంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని, త్వరలో పరిష్కరిస్తామని అన్నారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ఐటీడీఏ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.