
తిరుపతి, షిరిడీకి రైళ్లు నడపాలి
కొత్తగూడెంఅర్బన్ : భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి తిరుపతి, షిరిడీకి రైళ్లు నడపాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి రైల్వే అధికారులకు సూచించారు. స్టేషన్‌లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. శనివారం ఆయన రైల్వే స్టేషన్‌లో పనులను పరిశీలించారు. పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయని ప్రశ్నించారు. త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కరోనా సమయంలో రద్దు చేసిన రైళ్లన్నింటినీ తక్షణమే పునరుద్ధరించాలని, కాకతీయ రైలును మణుగూరు వరకు పొడిగించాలంటూ హైదరాబాద్‌లోని రైల్వే అధికారులకు ఫోన్ చేశారు. ఎంపీ వెంట జెడ్పీ మాజీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చీకటి కార్తీక్, నాయకులు ఆళ్ల మురళి, ఊకంటి గోపాల్‌రావు, రైల్వే బోర్డు మెంబర్ శ్రీనివాసరెడ్డి, రజాక్, విజయాబాయి, హైమావతి, రాంబాబు ఉన్నారు.
సింగరేణి డైరెక్టర్లతో భేటీ..
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి డైరెక్టర్లతో ఎంపీ రఘురాంరెడ్డి సంస్థ ప్రధాన కార్యాలయంలో శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీకే –7ఓసీ, రొంపేడు ఓసీ తదితర గనుల అనుమతులపై ఆరా తీశారు. సింగరేణి ఆస్పత్రుల్లో సరిపడా వైద్యులను నియమించి కార్మికులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. సింగరేణి సీఎస్సార్ నిధులతో సమీప గ్రామాల్లో రోడ్లు, లైటింగ్ వంటి అభివృద్ధి పనులపై సమీక్షించారు. కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, సత్యనారాయణ రావు, ప్రాతినిధ్య సంఘం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సి.త్యాగరాజన్ తదితరులు పాల్గొన్నారు.
అధికారులకు ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి సూచన