
14 మంది మావోయిస్టుల లొంగుబాటు
కొత్తగూడెంటౌన్ : ఛత్తీస్‌గఢ్‌తో పాటు జిల్లాకు చెందిన 14 మంది మావోయిస్టులు ఎస్పీ రోహిత్‌రాజ్ ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. లొంగిపోయిన ఏసీఎం కేడర్ గలవారు ఇద్దరు, నలుగురు పార్టీ సభ్యులు, ముగ్గురు మిలీషియా సభ్యులు, కిసాన్ మజ్దూర్ సంఘ్‌కు చెందిన ఒకరితో పాటు దండకారణ్య కిసాన్ మజ్దూర్ సంఘ్‌కు చెందిన నలుగురు ఉన్నారని, వారిలో ముగ్గురు మహిళలని వివరించారు. హింసకు కాలం చెల్లిందని, మావోయిస్టుల సిద్ధాంతాలను ఎవరూనమ్మడం లేదని అన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 227 మంది లొంగిపోయారని, పోలీసులు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై లొంగిపోతున్నారని తెలిపారు. పార్టీలో సీనియర్ల పోకడలు నచ్చక పోవడంతో పాటు పోలీసులు చేపట్టిన ఆపరేషన్ చేయూత కూడా కలిసి వస్తోందన్నారు. ఇప్పుడు లొంగిపోయిన 14 మందిలో వారి స్థాయిని బట్టి రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ఆర్థిక సాయం అందించామని చెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 227 మంది మావోయిస్టులు లొంగిపోగా, 130 మందికి రివార్డులు అందించడంతో పాటు పునరావాసం కల్పించామని తెలిపారు. కాలం చెల్లిన సిద్ధాంతాలు అనుసరిస్తున్న మావోయిస్టులు ఏజెన్సీ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దాడులు, మందుపాతరలను అమర్చడం వంటి చర్యలతో ఆదివాసీలను భయాందోళనలకు గురి చేస్తున్నారని అన్నారు. సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, 81,141 బెటాలియన్ అధికారులు ఆర్‌ఎస్ శర్మ, కమల్‌వీర్ యాదవ్, చర్ల సీఐ రాజువర్మ, ఎస్సై నర్సిరెడ్డి పాల్గొన్నారు.
ఈ ఏడాది ఇప్పటివరకు 227 మంది..
130 మందికి పునరావాసం కల్పించామని ఎస్పీ వెల్లడి