
10న ‘సౌరగిరి’కి శ్రీకారం
● ఇందిరా సౌరగిరి జల వికాసం పథకానికి పైలట్ గ్రామంగా బెండాలపాడు ● డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రారంభోత్సవం ● ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే, ఐటీడీఏ పీఓ
చండ్రుగొండ : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టిన ఇందిరా సౌరగిరి జల వికాసం పథకానికి ఈనెల 10న శ్రీకారం చుట్టనున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. గిరిజనుల పోడు భూముల్లో సాగునీటి సదుపాయం కల్పన కోసం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన బెండాలపాడులో ప్రారంభిస్తారని వెల్లడించారు. పోడుపట్టాలు పొందిన ప్రతీ రైతుకు 2.5 ఎకరాల భూమిలో రూ. 6 లక్షల వ్యయంతో బోరుబావుల నిర్మించనున్నట్లు తెలిపారు. అంతకంటే తక్కువ భూమి ఉన్నవారికి ఇతర రైతులను అనుసంధానం చేస్తూ బోరు మంజూరు చేస్తారని వివరించారు. పోడుభూముల్లో సాగునీటి సదుపాయంతోపాటు డ్రిప్ ఇరిగేషన్, భూమి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రధానంగా ఆయిల్‌పామ్ సేద్యం వైపు పోడురైతులను ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ బయ్యారపు అశోక్, నాయకులు భోజ్యానాయక్, ఫజల్, బొర్రా సురేష్, మల్లం కృష్ణయ్య పాల్గొన్నారు.