
క్రమపద్ధతిలో ఎరువులు వాడాలి
అశ్వారావుపేట : అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో స్థానిక రైతు వేదికతో పాటు మండలంలోని వినాయకపురంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్‌కుమార్ మాట్లాడుతూ.. భూసార పరీక్షలు నిర్వహించాక నిర్ణీత మోతాదుల్లోనే ఎరువులు వేయాలని రైతులకు సూచించారు. యూరియా వినియోగం తగ్గిస్తూ భూసారాన్ని కాపాడుకుని అధిక దిగుబడి సాధించాలని అన్నారు. జిల్లా వ్యవసాయాధికారి వి. బాబూరావు మాట్లాడుతూ రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా రశీదులు తీసుకోవాలని సూచించారు. ఏళ్లుగా ఒకే పంట కాకుండా మార్పు చేస్తే అధిక లాభాలు సాధించవచ్చని తెలిపారు. అశ్వారావుపేట పీఏసీఎస్ చైర్మన్ చిన్నంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ రైతులు, శాస్త్రవేత్తలను ఒక దగ్గరకు చేర్చి అన్నదాతలకు విజ్ఞానం పెంచేలా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా లాభాల గురించి ఏడీఏ రవికుమార్ వివరించారు. వ్యవసాయంతో పాటు పశుపోషణపై దృష్టి సారించాలని ఏడీహెచ్ డాక్టర్ ప్రదీప్ అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు ఐ.వి.శ్రీనివాసరెడ్డి, కె.నాగాంజలి, ఎం.రాంప్రసాద్, ఎస్.మధుసూదన్ రెడ్డి, శ్రావణ్‌కుమార్, పావని, నీలిమ, శ్రీలత, కోటేశ్వర్, కృష్ణతేజ, ఆర్.రమేష్, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’
కార్యక్రమంలో అధికారుల సూచన