ఓసీ–4లో కార్మికుడికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

ఓసీ–4లో కార్మికుడికి గాయాలు

May 6 2025 12:36 AM | Updated on May 6 2025 12:36 AM

ఓసీ–4లో కార్మికుడికి గాయాలు

ఓసీ–4లో కార్మికుడికి గాయాలు

మణుగూరు టౌన్‌: సింగరేణి కాలరీస్‌ మణుగూరు ఏరియాలోని ఓసీ–4లో పనులు నిర్వహిస్తున్న క్రమంలో జారిపడి ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డ ఘటన సోమవారం జరిగింది. వివరాలు ఇలా.. ఫిట్టర్‌గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యనాయుడు ల్యాడర్‌పై వెల్డింగ్‌ పనులు జరుగుతున్న క్రమంలో స్టాండ్‌ ఒక్కసారిగా వైపునకు ఒరిగిపోయింది. దీంతో 12 అడుగుల ఎత్తు పైనుంచి జారిపడ్డాడు. దీంతో కార్మికుడి తలకు, ఛాతీ పక్కటెముకకు, మెడకింద భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. తోటి కార్మికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స అందించి మెరుగైన వైద్యసేవలకు కొత్తగూడెం ప్రధాన ఆస్పత్రికి తీసుకెళ్లారు.

పిడుగుపాటుతో మూడు పశువులు మృతి

దుమ్ముగూడెం : మండలంలోని మారాయిగూడెం పంచాయతీ పరిధి జిన్నెగట్టు గ్రామానికి చెందిన అపకా రామారావుకు చెందిన మూడు పశువులు ఆదివారం పిడుగుపాటుతో మృతి చెందాయి. పశు వైధ్యాధికారి లిఖిత పోస్టుమార్టం నిర్వహించారు. కాగా తనకు పరిహారం చెల్లించాలని బాధితుడు ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.

ఎనిమిది మంది పేకాటరాయుళ్ల అరెస్టు

ఇల్లెందురూరల్‌: మండలంలోని రేపల్లెవాడ గ్రామపంచాయతీ కట్టుగూడెం గ్రామం శివారు పురాతన పెంకు పరిశ్రమలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై సోమవారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేశారు. ఎనిమిది మంది పేకాటరాయుళ్లను అరెస్ట్‌ చేశారు. రూ.46వేల నగదు, ఎనిమిది సెల్‌ఫోన్లు, కారు, రెండు బైక్‌లను స్వాదీనం చేసుకున్నారు. కాగా స్థావరం నిర్వాహకుడు పరారయ్యాడు. కేసు నమోదు చేసినట్లు సీఐ బత్తుల సత్యనారాయణ తెలిపారు.

మహిళపై కేసు నమోదు

కూసుమంచి: ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.3.29 లక్షలు కాజేసిన మహిళపై సోమవారం కూసుమంచి పోలీసులు కేసు నమోదు చేశారు. కూసుమంచికి చెందిన దామళ్ల రామచంద్రయ్యను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రొంపేడుకు చెందిన గుదిబండ్ల ఆదిలక్ష్మి పరిచయం చేసుకుంది. రామచంద్రయ్య కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఆయన నుంచి విడతల వారీగా రూ.3.29లక్షలు తీసుకుని ముఖం చాటేసింది. దీంతో మోసపోయినట్లు గుర్తించిన ఆయన చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.

వైటీపీఎస్‌ డీఈ మృతికి సంతాపం

మృతుడి అవయవాలను దానం చేసిన కుటుంబీకులు

పాల్వంచ: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ డీఈ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. పాల్వంచలో సోమవారం అంత్యక్రియలు పూర్తిచేశారు. కేటీపీఎస్‌ కాంప్లెక్స్‌లో సుదీర్ఘకాలం విధులు నిర్వహించిన డీఈ ధరావత్‌ రమేష్‌ (47) రెండు నెలల క్రితం వైటీపీఎస్‌కు బదిలీపై వెళ్లాడు. వారం రోజుల క్రితం బైక్‌పై ఖమ్మం నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డాడు. దీంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. అతని అవయవాలను కుటుంబ సభ్యులు జీవన్‌దాన్‌ ట్రస్ట్‌కు అందించారు. మృతదేహాన్ని సోమవారం పాల్వంచలోని కేటీపీఎస్‌ క్వార్టర్‌ (నివాసం)కు తీసుకొచ్చారు. పలువురు అధికారులు, ఉద్యోగులు సందర్శించి నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement