
ఇద్దరు నకిలీ మావోయిస్టులు అరెస్ట్
గుండాల: మూడు నెలల నుంచి మావోయిస్టు పార్టీ పేరుతో వ్యాపారులను బెదిరిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం గుండాల పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. గుండాల ఎస్సై సైదా రవూఫ్ సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా తూరుబాక వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా అదుపులోకి తీసుకున్నారు. విచారించగా గుండాల మండలం గణాపురం గ్రామానికి చెందిన కల్తిపాపయ్య అలియాస్ సర్పంచ్, ఆళ్లపల్లి మండలం నడిమిగూడెం గ్రామానికి చెందిన పాయం రాజేందర్‌గా తేలింది. వీరు గతంలో ప్రజాప్రతిఘటన దళంలో పని చేశారు. జల్సాలకు అలవాటు పడి డబ్బు కోసం మావోయిస్టు పార్టీ పేరుతో మూడు నెలలుగా గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో వ్యాపారులను ఫండ్ కావాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు. వారిపై నిఘా ఉంచగా తప్పించుకుని తిరుగుతున్నారు. సోమవారం పట్టుబడగా, వారి నుంచి రూ. 5వేలు, రెండు మొబైల్స్ స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ రవీందర్, ఎస్సై సైదా రహూఫ్, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లులను ఆయన అభినందించారు.