
రామయ్య చెంతకు..
అంజన్న మాలధారులు
భద్రాచలం: భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి, శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. వేలాది మంది భక్తులు తరలివచ్చి శ్రీసీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుంటారు. ఆ రెండు వేడుకల తర్వాత హనుమాన్ జయంతి వేడుకలను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. రామయ్య స్వామికి హనుమాన్ వీర భక్తుడు కావడంతో ఇటీవల కాలంలో ఆంజనేయ మాలధారులు అధిక సంఖ్యలో భద్రగిరి వస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల భక్తులు భద్రాద్రి రామయ్య చెంతన ఇరుముడి విరమిస్తున్నారు. సుమారు వారం రోజులపాటు 50 వేల మందికి పైగానే స్వామివారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో హనుమాన్ జయంతి క్రమంగా ఉత్సవంగా మారుతోంది. ఈ నెల 22న హనుమాన్ జయంతి నిర్వహించనుండగా, భద్రాచలంలో కనీస ఏర్పాట్లు చేయాలని పలువురు కోరుతున్నారు.
భజనలకు వేదికేది..?
మాలవిరమణకు వచ్చిన భక్తులు తొలుత పవిత్ర గోదావరిలో స్నానాలు ఆచరిస్తారు. అనంతరం టికెట్‌తో ప్రధాన దేవస్థానంలోని ఆంజనేయస్వామి ఉపాలయంలో మాలవిరమణ చేస్తారు. ఉపాలయం కావటంతో రద్దీ ఉంటోంది. సామూహిక మాల విరమణ కోసం తగిన హాల్ లేదు. మాల విరమణ టికెట్‌తోనే ఉచిత దర్శనం కల్పించాలని భక్తులు కోరుతున్నారు. రామయ్య చెంతన భజన, హనుమాన్ చాలీసా పారాయణం చేసేందుకు వేదిక లేదు. చిత్రకూట మండపంలో అవకాశం ఉన్నా ఇటీవల స్వామివారికి దాతలు సమర్పించిన బంగారు పూత వాహనాలు అక్కడ ఉంచటంతో, అక్కడ జరిగే కార్యక్రమాలను నిలిపివేశారు. కేవలం రద్దీ సమయంలో నిత్యకల్యాణం అక్కడ జరుపుతున్నారు. హనుమాన్ జయంతికి కనీసం వారం రోజుల ముందే దేవస్థానం అధికారులు భజన మందిరం ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. ఏటా స్వామివారి ప్రసాదం, లడ్డూల విక్రయ కేంద్రాల వద్ద తొక్కిసలాట జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రసాదాల విక్రయాలకు తాత్కాలిక కౌంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
వసతులు కల్పిస్తే శబరిమల తరహాలో
అభివృద్ధి..
తెలంగాణలో ఆంజనేయ మాల విరమణకు కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానానికి, అనంతరం భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి మాత్రమే మాలధారులు తరలివస్తారు. క్రమంగా ప్రధాన ఉత్సవంగా మారుతున్న హనుమాన్ జయంతికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు, వసతులను కల్పిస్తే మరో శబరిమలగా మారే అవకాశం ఉంది. ముక్కోటి, శ్రీరామనవమిలకు రూ. కోట్లు వ్యయం చేసినా అదే స్థాయిలో ఆదాయం వస్తుంది. హనుమాన్ మాలధారులకు కూడా కనీస వసతులు కల్పిస్తే ఆలయానికి ఆదరణ, హుండీ ఆదాయం భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. పరోక్షంగా స్థానికులకు ఉపాధి కూడా దొరుకుతుంది. ఇప్పటికై న దేవాదాయ శాఖ స్పందించి హన్‌మాన్ మాలధారులకు తగిన సౌకర్యాలు కల్పించాలని పలువురు భక్తులు కోరుతున్నారు.
ఏటా అధిక సంఖ్యలో తరలివస్తున్న భక్తులు
భద్రాచలంలో మాల విరమణకు ఆసక్తి
ముక్కోటి, నవమి తర్వాత రద్దీ వేడుక
ఈ నెల 22న హనుమాన్ జయంతికి ఏర్పాట్లు చేయాలని విన్నపం