ఫలితాలు ఎందుకు తగ్గాయి? | - | Sakshi
Sakshi News home page

ఫలితాలు ఎందుకు తగ్గాయి?

May 2 2025 12:08 AM | Updated on May 2 2025 12:08 AM

ఫలితాలు ఎందుకు తగ్గాయి?

ఫలితాలు ఎందుకు తగ్గాయి?

ఖమ్మంమయూరిసెంటర్‌: ఇంటర్మీడియట్‌ ఫలితాలు ఇటీవల వెల్లడి కాగా.. పలు సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడంపై సంస్థ కార్యదర్శి దృష్టి సారించారు. గురుకులాల్లో అన్ని వసతులు కల్పిస్తూ, నిరంతర పర్యవేక్షణలో బోధించినా విద్యార్థులు ఫెయిల్‌ కావడంతో ప్రిన్సిపాళ్లపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే 80శాతం కన్నా తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదైన గురుకులాల ప్రిన్సిపాళ్లకు ఎస్సీ సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డాక్టర్‌ వీ.ఎస్‌.అలగు వర్షిణి తాజాగా షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈ జాబితాలో ఉమ్మడి జిల్లాలోని పలు గురుకులాలు కూడా ఉన్నాయి. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఫలితాలకు సంబంధించి 12, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి ఆరు గురుకులాల ప్రిన్సిపాళ్లకు నోటీసులు జారీ అయ్యాయి.

చర్యలు ఎందుకు తీసుకోవద్దు..

ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 80 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత నమోదైన ఎస్సీ గురుకుల కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఇటీవల నోటీసులు అందాయి. వీరి నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోకూడదో కారణం చెప్పాలని అందులో పేర్కొన్నారు. నోటీసులకు ప్రిన్సిపాళ్లు పది రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేదంటే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

80శాతం కన్నా తక్కువ ఉత్తీర్ణత నమోదైన కళాశాలలు

ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ గురుకుల కళాశాలల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరానికి సంబంధించి 80 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత నమోదైన కళాశాలల వివరాలిలా ఉన్నాయి. నేలకొండపల్లి బాలికలు కళాశాలలో 79.75 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, అన్నపురెడ్డిపల్లి(బాలుర)లో 78.95, వైరా(బాలికలు)లో 77.78, ములకలపల్లిలో 75.34, తిరుమలాయపాలెం(బాలుర)లో 67.92, ఎర్రుపాలెం(బాలికలు)లో 56.94, ముదిగొండ(బాలుర)లో 55.07, ఇల్లెందు(బాలికల)లో 54.35, భద్రాచలం(బాలికలు)లో 54.29, దమ్మపేట(బాలుర)లో 47.27, మణుగూరు(బాలుర)లో 33.33, సత్తుపల్లి(బాలుర)లో 30.56 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక ద్వితీయ సంవత్సరానికి వచ్చేసరికి భద్రాచలం బాలికల కళాశాలలో 79.41 శాతం, పాల్వంచ(బాలుర)లో 76.47, సత్తుపల్లి(బాలుర)లో 72.22, వైరా(బాలికలు)లో 67.11, ఇల్లెందు(బాలికలు)లో 66.67, మణుగూరు(బాలికలు) కళాశాలలో 47.06శాతంగా ఉత్తీర్ణత నమోదైంది.

ఎస్సీ గురుకులాల ప్రిన్సిపాళ్లకు

షోకాజ్‌ నోటీసులు

ఇంటర్‌లో ఉత్తీర్ణత శాతం తగ్గడంపై వివరణ ఇవ్వాలని ఆదేశం

జాబితాలో ఉమ్మడి జిల్లాలోని

14 కళాశాలలు

అన్ని వసతులు.. నిపుణులైన అధ్యాపకులు

పేద విద్యార్థులకు మెరుగైన బోధన అందించేలా ఉన్నత విద్యార్హతలు కలిగిన అధ్యాపకులను నియమించడంతో గురుకులాల్లో అన్ని వసతులు కల్పించినా ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణత నమోదు కాకపోవడంపై అధికారులు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పలు ప్రశ్నలు సంధిస్తూ ప్రిన్సిపాళ్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ‘గ్రామీణ ప్రాంతాల నుంచివచ్చే అణగారిన, షెడ్యూల్డ్‌ కులాల పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించడానికి ప్రభుత్వం తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలను స్థాపించింది. సొసైటీ అధిక అర్హత కలిగిన ఉపాధ్యాయులుగా నియమించింది. విద్యార్థులు దాదాపు ఐదేళ్లుగా రెసిడెన్షియల్‌ పాఠశాలలో ఉన్నారు. 90శాతం మంది పదో తరగతిలో ఉత్తీర్ణులైతే, ఇంటర్‌లో 100శాతం ఉత్తీర్ణత సాధించలేదు. ప్రిన్సిపాళ్లు చిత్తశుద్ధితో కృషి చేస్తే విద్యార్థులందరినీ పాస్‌ స్థాయికి సులభంగా తీసుకురావొచ్చు. అయినా అలా ఫలితాలు ఎందుకు రాలేదు’అని నోటీసుల్లో ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement