
వ్యక్తి మృతికి కారణమైన యువకుడికి జైలు
భద్రాచలంఅర్బన్: ఆగి ఉన్న బైక్‌ను ఢీకొట్టి ఓ వ్యక్తి మరణానికి కారకుడైన వ్యక్తికి 16 నెలల జైలుశిక్ష విధిస్తూ భద్రాచలం ప్రథమశ్రేణి న్యాయమూర్తి శివనాయక్ మంగళవారం తీర్పు చెప్పారు. 2014, అక్టోబర్ 31న దుమ్ముగూడెంనకు చెందిన పూర్ణచందర్‌రావు తన భార్య భవానితో కలిసి చిన్ననల్లబెల్లి వైపు ద్విచక్రవాహనంపై వెళ్తూ మధ్యలో ఆగాడు. ఈ క్రమంలో పర్ణశాల నుంచి లక్ష్మీనగరం వైపు ద్విచక్రవాహనంపై వస్తున్న వరక మహేశ్ ఆగి ఉన్న పూర్ణచందర్‌రావు బైక్‌ను వేగంగా ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన పూర్ణచందర్‌రావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వరక మహేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి శివనాయక్ 16 నెలలు జైలు శిక్షతో పాటు రూ.1,500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు
ఇల్లెందురూరల్: ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రానికి చెందిన వేల్పుల రాజు ఈ నెల 26న మాణిక్యారం నుంచి స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరాడు. అదే సమయంలో ఇల్లెందు నుంచి మాణిక్యారం వెళ్తున్న బొలేరో వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో రాజు తీవ్రంగా గాయపడ్డాడు. నాటి నుంచి ఖమ్మంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాజు తండ్రి రాంమ్మూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు కొమరారం ఎస్‌ఐ నాగుల్‌మీరా మంగళవారం తెలిపారు.
సెంట్రల్ లైటింగ్‌ను ఢీకొట్టిన లారీ
లారీ కిందకు వెళ్లిన స్కూటీ.. తప్పిన ప్రాణాపాయం
పాల్వంచ: బీసీఎం రహదారిపై ఓ బొగ్గు లారీ మంగళవారం రాత్రి సెంట్రల్ లైటింగ్‌ను ఢీకొట్టింది. స్థానికుల కథనం మేరకు.. కొత్తగూడెం వైపు నుంచి పాల్వంచకు బొగ్గు లారీ వస్తూ బీసీఎం రహదారిలో ఒడ్డుగూడెం క్రాస్ రోడ్డు వద్ద పక్కకు దూసుకు పోయి, సెంట్రల్ లైటింగ్ స్తంభం, హోర్డింగ్‌ను ఢీకొంది. సెంట్రల్ లైటింగ్ స్తంభం కూలింది. మరోవైపు స్కూటీపై వస్తున్న ఓ వ్యక్తి లారీ వస్తున్న విషయాన్ని గుర్తించి స్కూటీని వదిలీ పక్కకు దూకడంతో ప్రాణాపాయం తప్పింది. స్కూటీ లారీ టైర్ల కిందపడి నుజ్జునజ్జయింది. పోలీస్, మున్సిపల్, విద్యుత్ శాఖాధికారులు అక్కడికి వచ్చి పరిశీలించారు.