
భూ సమస్యలకు సత్వర పరిష్కారం
దమ్మపేట : ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు భూ భారతి చట్టం ద్వారా సత్వర పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. మండలంలోని మల్లారం రైతు వేదికలో భూ భారతి చట్టంపై సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ధరణి కంటే మేలుగా అనేక సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ఈ చట్టం రూపొందించారని తెలిపారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌కు ముందు భూమి యొక్క సర్వే మ్యాప్‌ను తయారు చేసి, పట్టాదారు పాసుపుస్తకంలో భూమి పటం ముద్రించనున్నట్లు చెప్పారు. మ్యుటేషన్ ప్రక్రియలో పూర్తిస్థాయి విచారణ చేశాకే పట్టా పేరు మారుతుందని స్పష్టం చేశారు. ఒకే సర్వే నంబర్‌పై పలుమార్లు తప్పుడు రిజిస్ట్రేషన్లు జరగకుండా, ఆ భూమికి భూదార్ కార్డులను జారీ చేసి, సమస్యల పరిష్కారంలో రెండంచెల అప్పీలు వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. ఇంటి స్థలాలు, వ్యవసాయేతర భూములకు కూడా భూ రికార్డుల్లో హక్కులు కల్పిస్తామన్నారు. మోసపూరితంగా పట్టా మార్పిడి జరిగితే వాటిని రద్దు చేసే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణ మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలోనూ గ్రామ పరిపాలన అధికారి ద్వారా రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అధికారులు నిబద్ధతతో పనిచేసి భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ మధు, ఇన్‌చార్జ్ తహసీల్దార్ కె.వాణి, ఎంపీడీఓ రవీంద్రారెడ్డి, ఏఓ చంద్రశేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్