
పాడి వృద్ధి.. పాలు సమృద్ధి..
● సహకార సంఘాల సభ్యులకు డీసీసీబీ ద్వారా రుణాలు ● పాడి యూనిట్లలో 70 శాతం మేర లోన్ ● ఆపై సొసైటీల ద్వారా పాల సేకరణకు ప్రణాళిక
ఖమ్మంవ్యవసాయం: చిన్న, సన్నకారు రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పాడి పథకానికి రూపకల్పన చేసింది. పాలు, పాల ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈ ప్రాజెక్టును రూపొందించగా.. రైతుల సంక్షేమం, శ్రేయస్సు కోసం కొనసాగుతున్న సహకార సంఘాల్లో సభ్యులకు లబ్ధి జరగనుందని భావిస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ రంగ అభివృద్ధి కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్రమాన అనుబంధంగా పాడి పరిశ్రమకూ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. రూ.3,460.70 కోట్ల లావాదేవీలతో రాష్ట్రంలోనే రెండో స్థానంలో కొనసాగుతున్న ఖమ్మం డీసీసీబీ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలే కాక మహబూబాబాద్, ములుగు జిల్లాల్లోని బయ్యారం, గార్ల, వాజేడు, వెంకటాపురం మండలాలకు విస్తరించి ఉంది. మొత్తంగా 100 సహకార సంఘాలతో 1.70 లక్షల మంది సభ్యులతో కూడిన ఈ బ్యాంకు 50 బ్రాంచ్‌లతో లావాదేవీలు కొనసాగిస్తోంది. ఈ ఏడాది రూ.9.64 కోట్ల లాభాలతో ఉన్న నేపథ్యాన పాడి పరిశ్రమపై ఆసక్తి ఉన్న వారికి చేయూతనివ్వాలని కొత్త పథకాన్ని రూపొందించింది. తద్వారా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి పాలు దిగుమతి అవసరం లేకుండా స్థానికంగా పాల ఉత్పత్తి పెరుగుతుందని భావిస్తున్నారు.
30 శాతం నిధులు చాలు..
పాడి యూనిట్ల స్థాపనకు ముందుకొచ్చే రైతులకు డీసీసీబీ రుణాలు ఇవ్వనుంది. ఆసక్తి కలిగిన వారు 30 శాతం నిధులతో ముందుకొస్తే మిగతా 70 శాతం నిధులను బ్యాంకు వాటాగా సమకూరుస్తుంది. ఉదాహరణకు రూ.లక్ష విలువైన గేదెకు రైతు రూ.30 వేలు తన వాటాతో సిద్ధమైతే మిగతా రూ.70 వేలు రుణంగా అందుతుంది. గరిష్టంగా రెండు గేదెల వరకు అవకాశం కల్పిస్తారు.
సొసైటీ సభ్యులకే అవకాశం
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘా(పీఏసీఎస్)ల్లో సభ్యులైన వారికి మాత్రమే ఈ పథకంలో చోటు కల్పిస్తారు. వ్యవసాయ భూమి, సాగునీటి వనరులు ఉండి, పంటలు సాగు చేసే వారికి పాడి పరిశ్రమలో ప్రాధాన్యత ఇస్తే బహుముఖ లాభాలు ఉంటాయని భావిస్తున్నారు. తద్వారా సహకార సంఘాల ఉద్దేశం కూడా నెరవేరి చిన్న, సన్నకారు రైతులు ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశముంటుందని చెబుతున్నారు.
నీటి వనరులు ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యత
డీసీసీబీ పరిధిలో నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో పాడి పరిశ్రమ పథకాన్ని అమలు చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సాగర్ ఆయకట్టు ప్రాంతంతో పాటు ఇతర జలవనరులు ఉన్న ప్రాంతాల్లో సహకార సంఘాల సభ్యులకు రుణాలు ఇవ్వనుండగా.. ఉమ్మడి జిల్లాలో సత్తుపల్లి, మధిర, వైరా, కూసుమంచి, భద్రాచలం, పినపాక వ్యవసాయ డివిజన్లలో అవకాశం దక్కనుంది. స్థానిక వాతావరణాన్ని తట్టుకునే జాతుల గేదెలనే రైతులు ఎంపిక చేసుకునేలా పశుసంవర్థక శాఖ పర్యవేక్షణ ఉంటుంది.
పీఏసీఎస్‌ల ద్వారా పాల సేకరణ
రైతులు పాడి యూనిట్ల ద్వారా ఉత్పత్తి చేసే పాలను సైతం పీఏసీఎస్‌ల ద్వారా సేకరిస్తారు. దళారులు లేకుండా వెన్న శాతం ఆధారంగా కొనుగోలు చేయనున్నారు. ఈ ప్రక్రియతో సహకార సంఘాలతో పాటు పాడి రైతులకు ప్రయోజనం కలగనుంది. పాల కొనుగోలుకు అవసరమైన శీతలీకరణ యంత్రాలు, పరికరాలను పీఏసీఎస్‌లు సమకూర్చుకుంటాయి.
కలెక్టర్ అనుమతితో అమలు
చిన్న రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పాడి పరిశ్రమ ప్రాజెక్టును రూపొందించాం. సౌకర్యాలు ఉన్న ప్రాంతాల రైతులకు ప్రాధాన్యత ఉంటుంది. సహకార లక్ష్యం నెరవేరేలా పథకాన్ని అమలుచేస్తాం. బ్యాంకు పాలకవర్గం నిర్ణయంతో పాటు కలెక్టర్ అనుమతితో జూన్ నాటికి ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నాం. –ఎన్.వెంకటఆదిత్య,
సీఈఓ, డీసీసీబీ ఖమ్మం

పాడి వృద్ధి.. పాలు సమృద్ధి..