
ఆమె విజయం.. స్ఫూర్తిదాయకం..
● వ్యాధి భయపెట్టినా.. లక్ష్యాన్ని చేరిన యువతి.. ● గ్రూప్–1తో పాటు 5 ఉద్యోగాల విజేత జ్యోతి శిరీష
ఖమ్మంవైద్యవిభాగం: యాభైసార్లు రక్తం ఎక్కించుకుని, ఒకవైపు తన వ్యాధిని నయం చేసుకుంటూనే మరోవైపు సర్కారు కొలువు కొట్టాలనే సంకల్పంతో పోరాడి.. తన లక్ష్యాన్ని చేరుకున్న జ్యోతి శిరీష ఆదర్శప్రాయురాలని ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు కూరపాటి ప్రదీప్‌కుమార్ పేర్కొన్నారు. రేయింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టి గ్రూప్–1లో ర్యాంకు సాధించి ఏకంగా 5 సర్కారు కొలువులను కొట్టిన యువతి.. ఖమ్మం జిల్లాకే గర్వకారణమని కొనియాడారు. నిరుపేద కుటుంబంలో జన్మించి, బాల్యం నుంచే సికిల్‌సెల్ రక్తహీనతతో కూడిన వ్యాధితో బాధపడుతున్న ఆమె.. ఐదు ఉద్యోగాలు సాధించిన తీరు అద్భుతమన్నారు. ఆమె పూర్తి వైద్య ఖర్చులతో పాటు మందులను కూడా ఉచితంగా అందిస్తానని ఆయన హమీ ఇచ్చారు. ఆదివారం ఆయన వైద్యశాలలో జ్యోతి శిరీషను సన్మానించారు. ఈ సందర్భంగా జ్యోతిశిరీష మాట్లాడుతూ.. అత్యంత ప్రమాదకరమైన సికిల్‌సెల్ వ్యాధితో తాను బాధపడుతూ అనేక సందర్భాల్లో తాను సమాజాన్ని చూస్తానో లేదో అని భయపడినప్పటికీ.. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే అకుంఠిత దీక్షతో తాను గ్రూప్–1లో ర్యాంకును సాధించానని తెలిపారు. తనది జిల్లాలోని మిట్టపల్లి గ్రామమని, తండ్రి సుతారీ మేస్త్రి, అమ్మ వ్యవసాయ కూలీ అని తెలిపారు. తాను సికిల్ సెల్ ఎనీమియా (తీవ్ర రక్తహీనత) బాధితురాలినని, ఆరో తరగతిలో తనకీ సమస్య ఉందని వైద్యులు నిర్ధారించారని, తరచూ రక్తం తగ్గిపోయి కాళ్లు, చేతులు వాపు వచ్చేవని, దానికితోడు తలనొప్పి, ఎముకల మధ్య సూదులతో గుచ్చినట్టు బాధ ఉండేదని, అన్నీ భరించి, ఉద్యోగాలు సాధించానని, తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించారని తెలిపారు.