ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా దమ్మపేట వాసి
దమ్మపేట: ఏపీలోని అటవీ అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు దమ్మపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్ అధికారి పసుమర్తి మల్లికార్జునరావును నియమించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను సలహాదారుడుగా నియమిస్తూ మంగళవారం జీఓ జారీ చేసింది. మల్లికార్జునరావు గతంలో ఏపీలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు.
ఘనంగా అర్చక సంఘం ఆత్మీయ సమ్మేళనం
పాల్వంచ: పట్టణంలోని అల్లూరి సెంటర్ వరలక్ష్మి ఫంక్షన్ హాల్లో మంగళవారం జిల్లా ధూప, దీప, నివేదన ఆత్మీయ అర్చక సంఘం సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నావరుజుల ప్రసాద్‌శర్మ, అధికార ప్రతినిధి మరింగంటి భార్గవాచార్యులు ఆధ్వర్యంలో నూతన అధ్యక్షులు పురాణం కిరణ్‌కుమార్‌శర్మ, ప్రధాన కార్యదర్శి పాడికంటి సంతోష్‌కుమార్, కోశాధికారిగా కౌత ప్రసాద్‌శాస్త్రి, కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పంచాంగ ఆవిష్కరణ చేయించి ఐడీ కార్డులు ఆవిష్కరించారు.
పాస్టర్‌కు
గిన్నిస్‌బుక్‌లో స్థానం
పాల్వంచ: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పాల్వంచ వాసి, కాంట్రాక్టర్స్ కాలనీ ఇండియన్ పెంతికోస్త్ చర్చి పాస్టర్ మర్రి ఏసుదాసు స్థానం పొందారు. ఇటీవల హైదరాబాద్ మణికొండలో న్యూలైఫ్ చర్చ్‌లో జరిగిన, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన సరళీ స్వరాలు కీబోర్డ్ ప్లే చేసినందుకు స్థానం పొందారు. నిర్వాహకులు ఆగస్టీన్ దండింగి వేణుగోపాల్ చేతులమీదుగా సర్టిఫికెట్ అందుకున్నారు. మంగళవారం పలువురు ఏసుదాసును అభినందించారు.
వేసవిలో
దాహం తీర్చే చలివేంద్రం
టేకులపల్లి: వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకు ఏర్పాటు చేస్తున్న చలివేంద్రాలు ఎంతో ఉపయోగకరమని అన్నదానం తర్వాత జలదానం అనేది గొప్ప కార్యమని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ జి.మహేందర్ అన్నారు. మంగళవారం పిండిపోలు రామయ్య సేవా సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని బొమ్మనపల్లిలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో డీఈ రంగస్వామి, సేవా సంస్థ గౌరవ అధ్యక్షుడు, బొమ్మనపల్లి సబ్స్టేషన్ ఏఈ పిండిపోలు బుజ్జికన్నయ్య, ఏడీఈ హేమచంద్రబాబు, దేవ్‌సింగ్, నాగుల్‌మీరా, చరణ్, షకీల్, వసీం, యాకూబ్, శ్రీనివాసాచారి పాల్గొన్నారు.
కేసు నమోదు
ములకలపల్లి: చంపుతామని బెదిరింపులకు పాల్పడిన ఘటనలో మంగళవారం పోలీస్‌స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్‌హెచ్‌ఓ ప్రకాష్‌రావు కథనం మేరకు.. చాపరాలపల్లి గ్రామానికి చెందిన అర్జున్‌రావు తన ఇంటి ఆవరణలో పశువుల షెడ్డు నిర్మించుకొంటుండగా అదే గ్రామానికి చెందిన బాణోతు బాలాజీ దుర్భాషలాడాడు. అనంతరం ఇంటి ప్రహరీని బద్ధలు కొడతామని, ట్రాక్టర్ ఎక్కించి చంపుతామని బెదిరించారు. అర్జున్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.
తల్లిదండ్రులు మందలించారని
ఆత్మహత్య
నేలకొండపల్లి: తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మండలంలోని నాచేపల్లికి చెందిన నల్లగొండ యశ్వంత్(18) ఇటీవల ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాశాడు. ఆతర్వాత తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నట్లు తెలియగా, వారు మందలించారు. దీంతో బౌద్ధక్షేత్రం వద్ద ఓ వెంచర్‌లో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో తల్లిదండ్రులు చేరుకుని కన్నీరుమున్నీరుగా రోదించగా.. తండ్రి రాంబాబు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా దమ్మపేట వాసి
ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా దమ్మపేట వాసి
ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా దమ్మపేట వాసి


